జూలై 6న సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాల్గొనాలి
జిల్లా సమన్వయకర్త సరిత
రాయపర్తి అక్షిత ప్రతినిది
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలి ఉన్న ఇంటర్మీడియట్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త సముద్రాల సరిత తెలిపారు. రాయపర్తి, పర్వతగిరి, దుగ్గొండి బాలికల గురుకుల జూనియర్ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపులతో పాటు నర్సంపేట బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూలై 6 (సోమవారం)న టి.జి.ఎస్.డబ్ల్యూ.ఆర్. జూనియర్ కళాశాల (బాలికలు), రాయపర్తిలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌లో 2026 సంవత్సరంలో మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయబడదని స్పష్టం చేశారు. స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టి.సి.), స్టడీ/బోనాఫైడ్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు ఇతర అవసరమైన ఒరిజినల్ ధృవపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందాలని జిల్లా సమన్వయకర్త సముద్రాల సరిత కోరారు.