నందిపేట్ రెవెన్యూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలి….!

నందిపేట్ రెవెన్యూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలి….!

మండల ప్రజల డిమాండ్……!

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా నందిపేట్ ఒకప్పుడు 32 గ్రామాలతో కొనసాగిన మండలం, మండలాల పునర్విభజన అనంతరం ప్రస్తుతం 20–25 గ్రామాలతో కొనసాగుతోంది. నందిపేట్ మండలంలోని ప్రధాన గ్రామమైన డొంకేశ్వర్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ మండల పరిధిలో 13 గ్రామాలు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిపేట్ మండలం ఆర్థికంగా ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి ఏ అధికారి అయినా రావడానికి ఆసక్తి చూపేవారు,ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో గతంలో ఇక్కడ విధులు నిర్వహించేందుకు పలువురు రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపేవారని స్థానికులు పేర్కొంటున్నారు.
గత రెండు దశాబ్దాల కాలంలో అసైన్మెంట్ భూములను పట్టా భూములుగా మార్చే ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూముల మార్పిడి కోసం ఎకరానికి సుమారు రూ (1 లక్ష నుండి 2లక్షల) వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూముల రికార్డుల్లో పెద్ద ఎత్తున మార్పులు జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నందిపేట్ మండలంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన రెవెన్యూ అధికారుల సేవాకాలంలో జరిగిన భూముల లావాదేవీలు, పట్టాల మంజూరు, రికార్డు మార్పులు, ఆస్తుల వివరాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసైన్మెంట్ భూములకు సంబంధించిన పాత దస్త్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకుని నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు
ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరిపి, ఎవరైనా అవినీతికి పాల్పడి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ అధికారులు లేదా దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ఆరోపణలకు స్వతంత్రంగా అధికారిక నిర్ధారణ లేదు. విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గతంలో పనిచేసిన అధికారులపై దృష్టి..!

గతంలో నందిపేట్ మండలంలో విధులు నిర్వహించి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన కొంతమంది రెవెన్యూ అధికారుల సేవాకాలానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు సంస్థల దృష్టి ఉందనే ప్రచారం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులు, సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Breaking