ఉద్యోగులు టైంకి రాలే.. కలెక్టరేట్ గేటుకు తాళం!

ఉద్యోగులు టైంకి రాలే.. కలెక్టరేట్ గేటుకు తాళం!

– సమయపాలనపై ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు ఆగ్రహం..

– 10.30 గంటలకైనా విధులకు హాజరుకావాలని స్పష్టం

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో 

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమయపాలనపై ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. నిర్ణీత సమయానికి పలువురు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10.45 గంటల సమయంలో కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేయించి, ఆలస్యంగా వచ్చే సిబ్బందికి సమయపాలనపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకే విధులకు రావాలని తాను చెప్పడం లేదని, కానీ నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తుంటారని, ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడకూడదన్నారు. ఇకపై ఉదయం 10.30 గంటల వరకు విధులకు హాజరుకాకపోతే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భాస్కర్‌రావు ఆదేశించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, గేటుకు తాళం వేయించిన ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking