సూపర్ స్టార్ కృష్ణ…ఇకలేరు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ నటులు కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.