
కృష్ణ మరణం… సినీ రంగానికి తీరని లోటు
కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసిఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సినీ నటుడు కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో వారి పార్ధివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబును ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా ఐదు దశాబ్దాల పాటు సేవలందించిన కృష్ణ, పద్మాలయ సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తూ వేలాదిమంది కళాకారులకు ఉపాధి కల్పించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. కుటుంబ కథా చిత్రాలతోపాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ ప్రేక్షకులను మెప్పిస్తూ, అశేష జనాదరణ పొందారని సీఎం అన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ లాంటి నటున్ని కోల్పోవడం సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అన్నారు.

మన తెలుగు చలన చిత్ర రంగంలో సుప్రసిద్ద నటుడు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వ్యక్తి గతంగా నేను గొప్ప మిత్రుడిని కోల్పోయాను అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలా సార్లు వచ్చాను. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అలాగే మంచి విలక్షణమైన నటుడు. పార్లమెంట్ సభ్యుడుగా దేశానికి సేవ కూడా చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుందన్నప్పుడు ఆయన నవ్వారని సీఎం చెప్పారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారా? అని కృష్ణ గారు అన్నారని తెలిపారు. అల్లూరి సీతారామ రాజు సినిమా చాలా సార్లు చూశాను అని చెప్పా.. సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి మంచి దేశ భక్తిని ఉద్భోదించేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారిచేసింది. ఏదేమైనప్పటికి ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబానికి దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , పలువురు టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , నాయకులు ఉన్నారు .