అంతరించిపోతున్న గ్రామీణ ఆటలకు మళ్లీ జీవం పోయాలి: హరీష్ రావు
సిద్దిపేటలో చిర్ర గొనె టోర్నమెంట్ ప్రారంభం.
ఆన్‌లైన్ గేమ్స్‌తో సంప్రదాయ ఆటలు కనుమరుగవుతున్నాయి.
సిద్దిపేట, అక్షిత బ్యూరో ;
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఆడిన సంప్రదాయ ఆటలను తిరిగి వెలికితీసి నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన చిర్ర గొనె టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామాల్లో వాలీబాల్, చిర్ర గొనె, ఖో-ఖో వంటి ఆటలు యువతకు శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యాన్ని అందించేవని పేర్కొన్నారు. ఆరుబయట ఆటలు ఆడటం వల్ల సూర్యరశ్మి ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగేవని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు, యువత మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్‌కే పరిమితమవుతున్నారని, దీనివల్ల సంప్రదాయ ఆటలు కనుమరుగవడంతో పాటు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న చిర్ర గొనె వంటి ఆటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులను హరీష్ రావు అభినందించారు.

