ప్రజల గొంతుకగా జర్నలిజం
నిష్పక్షపాత జర్నలిజానికే మనుగడ
జర్నలిజం రాజకీయ పక్షాలకు కరపత్రం కాకూడదు
దాస్ మాతంగి చీఫ్ ఎడిటర్
వరంగల్, అక్షిత బ్యూరో :
సమస్యల సాధనకు ప్రజా గొంతుకగా జర్నలిజం ఉంటేనే, ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటుందని అక్షిత జాతీయ తెలుగు దిన పత్రిక చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి ఆకాంక్షించారు.నిష్పక్షపాతమైన జర్నలిజానికి చిన్న, పెద్ద తేడాలేమి ఉండవని, నిజాయితీతో రాసే వార్తలను బట్టే పత్రిక విలువ మన గలగుతుందన్నారు. మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లాల అక్షిత జాతీయ దినపత్రిక జర్నలిస్టుల సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లాల బ్యూరో చీఫ్ డాక్టర్ పాలడుగుల సురేందర్ అధ్యక్షతన కరీమాబాద్ లోని కమ్యూనిటీ రిసోర్సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం రూపాంతరం చెందుతూ అంపశయ్య పైన ఉందన్నారు. నిబద్ధత కలిగిన జర్నలిజాన్ని పరిరక్షించుకోవాలన్నారు. పత్రికా రంగానికి నిజమైన జర్నలిస్టుల ద్వారానే గుర్తింపు లభిస్తుందని, నిజమైన జర్నలిజం బతకాలంటే ప్రజల పక్షాన సామాజిక కోణంలో రాజకీయాలకు కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచినప్పుడు మాత్రమే సమాజంలో జర్నలిజం మనగలుగుతుందని అన్నారు. జర్నలిజం కరపత్రం కాకూడదని జర్నలిజం విలువలు కాపాడేందుకు మంచికి మంచి చెడుకు చెడు చూపించేలా జర్నలిస్టులు వ్యవహరించాలని, వాట్సప్ ఇతర గ్రూపుల్లో వచ్చే వార్తలను వార్తగా రాయకూడదని, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే వార్తలు ప్రచురించే విధంగా వ్యవహరించాలన్నారు. అనవసరపు నిడివి పెంచకుండా, అవసరం ఉన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టు నిష్పక్షపాతంగా వార్తలు రాసి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం చేసేందుకు, అన్యాయానికి గురవుతున్న వారి ఆక్రందనలు దృష్టికి వస్తే సంబంధిత శాఖ అధికారులకు విషయాన్ని తెలిసేలా వారికి న్యాయం చేసే విధంగా జర్నలిజం ఉండాలన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్,రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తిరునహరి శేషు మాట్లాడుతూ జర్నలిజం కొంతమంది స్వార్థాలకు తలొగ్గరాదని, సమస్యను ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తపరిచి నోరులేని సామాన్య జనం యొక్క గొంతుకై వారి సమస్యల సాధనకు కృషి చేసేలా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కొన్ని మీడియాలను ఏర్పాటు చేసుకున్న ఈ తరుణంలో నిష్పక్షపాతమైన జర్నలిజం తో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వాల కళ్ళు తెరిపిస్తున్న అక్షిత జాతీయ దినపత్రిక జర్నలిస్టులు, ఎడిటర్ చేస్తున్న కృషి సమాజ మార్పుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రచురిస్తున్న వార్తలు సమాజం మేల్కొలుపునకు దిక్సూచిగా చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. సీనియర్ జర్నలిస్ట్ జర్నలిజం అధ్యాపకుడు కంజర్ల నరసింహ రాములు మాట్లాడుతూ వార్త క్రమంలో కొన్ని పద్ధతులు పాటించాలని ఎప్పుడు, ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎలా అనే పద్ధతిలో వార్త నిర్మాణం ఉండాలన్నారు. అధికార పార్టీకి వంత పాడుతూ జర్నలిజం విలువలు తగ్గించకుండా నిజాన్ని నిర్భయంగా రాసే విధంగా జర్నలిస్టులు తమ యోగ్యతలు పెంచుకోవాలని వార్త నిర్మాణ పద్ధతులు నేర్చుకుని అధికారుల నుంచి అధికార పార్టీ నేతల నుంచి నిజాన్ని రాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా వార్త విషయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే వార్త సేకరించాక ప్రచురించే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని అప్పుడే పత్రిక నిబద్దత నిజాయితీ జర్నలిస్టు క్రెడిబిలిటీ పెరుగుతుందని వార్తకు గుర్తింపు వస్తుందని అన్నారు. రాజకీయ నేతలు పంపే వార్తలు ఉన్నది ఉన్నట్టుగా ప్రచురిస్తే వార్తకు విలువ ఉండదని, వార్తలోని సారాంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని జర్నలిస్టు వార్తలోని అర్ధాన్ని మాత్రమే రాసే విధంగా చూసుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ వార్త ప్రచురించే ముందు జర్నలిస్ట్ లోతైన విశ్లేషణ చేసి పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే వార్తను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎవరో చెప్పింది వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది ప్రచురించడం వల్ల వార్త పత్రికతో పాటు జర్నలిస్టు విలువలు కూడా దిగజారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాల జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ చుంచు ఐలయ్య, ఎండి. పాషా, మారపాక వెంకట స్వామి, ఆకోజు సాంబయ్య, వడగం శ్రీనివాస్, గిరి సునీల్, రాంపల్లి శ్రీనివాసచారి,జీ అశోక్, కొండమీది రాజన్ బాబు, గోపాల్ రెడ్డి, ఎం వెంకట్, ఎస్.వెంకటేష్, పాలడుగుల నిర్మల నికిత తదితరులు పాల్గొన్నారు.



