మైలారం గ్రామానికి ప్రత్యేక విద్యుత్ లైన్ ప్రారంభం
24 గంటల నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
రాయపర్తి అక్షిత ప్రతినిధి
మండలంలోని మైలారం గ్రామ ప్రజల విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ లైన్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. మైలారం విద్యుత్ ఉపకేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ లైన్ ద్వారా గ్రామానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామ ప్రజలు, రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు ద్వారా మైలారం గ్రామానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మైలారం గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ చిర్రా వేణు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మర కళ్యాణ్ గౌడ్ వనజారాణి గోవర్ధన్ రెడ్డి మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.