బ్యాంకుల సమ్మె వాయిదా
ఐబిఐతో చర్చలకు సై
5 రోజుల పని విధానంపై
చర్చించేందుకు కమిటీ
న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు సెప్టెంబర్ 28-30 నిర్వహించాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషాల్లో వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ-బ్యాంకుల యాజమాన్యాల ప్రతినిధి సంస్థ)తో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు యాథావిధిగా పనిచేయనున్నాయి. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, మరికొన్ని కీలక డిమాండ్లతో యూఎఫ్‌బీయూ మూడు రోజుల సమ్మెను తలపెట్టింది. ఉద్యోగులపై పని భారం అధికంగా ఉన్నందున వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిదినాలు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవులుగా ఉన్నాయి. అదే మాదిరి మిగిలిన అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించడంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. ‘‘ఈ కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తుంది. భాగస్వాములు అందరితో చర్చించి.. కస్టమర్లు సహా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని గుర్తిస్తుంది’’అని యూఎఫ్‌బీయూ తన ప్రకటనలో పేర్కొంది. స్కేల్ 4, అంతకు మించిన అధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకానికి (పీఎల్‌ఐ) సంబంధించి పథకంలోనూ సవరణలపై ఐబీఏతో చర్చలు ప్రారంభిస్తామని తెలిపింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా ఇరువర్గాలు సత్వర పరిష్కారం కోసం చర్చిస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా, సమ్మె ప్రభావం ప్రజలపై భారీగా పడకుండా కేంద్రం చొరవతో ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయడం విశేషం.