గుండెపూరిలో మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు

గుండెపూరిలో మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు

• రెండు దశాబ్దాలుగా కులమతాలకు అతీతంగా పీరీల పండుగ 

• అలావు ఎదుట రాత్రంతా భక్తుల ఆటపాటలు, కోలాహలం

• భక్తిశ్రద్ధలతో పాలు, పానకం సమర్పించిన గ్రామ ప్రజలు 

తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:

తిరుమలగిరి మండల పరిధిలోని గుండెపూరి గ్రామంలో మొహరం (పీరీల) పండుగ వేడుకలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా, మతసామరస్యానికి ప్రతీకగా జరిగాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ గ్రామంలో కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు కలిసికట్టుగా సవార్ల (పీరీల) వేడుకలను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామస్తులంతా ఒకేతాటిపై నిలిచి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొహరం ముగింపు ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అలావు (నిప్పుల గుండం) ఎదుట భక్తులు, యువకులు రాత్రంతా సాంప్రదాయ ఆటపాటలతో హోరెత్తించారు. పీరీల ఊరేగింపు సాగుతుండగా భక్తులు జయజయధ్వానాలు చేశారు. అనంతరం పీరీల గుండం వద్దకు చేరుకున్న భక్తులు నిష్ఠతో పాలు, పానకం సమర్పించారు. ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో పాతిహాలు (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.గ్రామంలో ఎలాంటి భేదభావాలు లేకుండా, అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి ఈ పండుగలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మరియు గుండెపూరి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొహరం ఉత్సవాలను విజయవంతం చేశారు. గ్రామంలో నెలకొన్న ఈ ఐక్యతను పరిసర గ్రామాల ప్రజలు సైతం అభినందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking