మెట్రో రెండో దశ విస్తరణనూ పూర్తి చేస్తాం : కేటీఆర్‌

మెట్రో రెండో దశ విస్తరణనూ పూర్తి చేస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్ నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్‌ విస్తరణపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. నగరం విస్తరిస్తున్నందున ప్రజారవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎంఎంటీఎస్‌ కోసం రూ.200కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు.ఈ నిధులతో ఎంఎంటీఎస్‌ను విస్తరణ చేపడుతాం. మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నం. సహకరిస్తారని ఆశిస్తున్నాం. సహకరించినా, సహకరించకపోయినా మొదటి దశ ఎట్లాయితే విజయవంతంగా పూర్తి చేశామో రెండో దశను పూర్తి చేస్తాం. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 5 కిలోమీటర్లు, మైండ్‌స్పేస్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మిస్తాం. కొవిడ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం తగ్గిన విషయం మీ అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడంతో ఇబ్బంది ఎదురవుతున్న విషయం తెలిసిందే. రెండు కారణాలతో అనుకున్న విధంగా ప్రణాళిక ప్రకారం.. మెట్రో విస్తరించాలనుకున్నా చేయలేకపోయాం. రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే’నని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

#జనవరిలో కొత్తగూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తాం..
‘ఈ రోజు ప్రారంభించిన శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ 2.8 కిలోమీటర్లు దీని పొడువు. అనుకున్న సమయానికి నిర్మించిన సంస్థకు ధన్యవాదాలు. 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ షేక్‌పేట ఫ్లైఓవర్‌తో సమానంగా హైదరాబాద్‌లోనే రెండో పొడువైన వంతెనగా నిలుస్తుంది. గచ్చిబౌలిలో 50శాతం వాహనదారులకు ఊరట కలుగుతుంది. కొండాపూర్‌ ఫ్లైఓవర్‌ రాబోయే తొమ్మిది పది నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. డిసెంబర్‌, జనవరిలో కొత్తగూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తాం. బొటానికల్‌ గార్డెన్‌, కొండాపూర్‌ ప్రాంతాలకు ఊరటనిచ్చే ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తాం. ఎమ్మెల్యే గాంధీ ప్రతిపాదనలు తీసుకొని పూర్తి చేస్తాం. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ తీర్చిదిద్దే దిశగా విద్యుత్‌ వ్యవస్థను, శాంతిభద్రతలు, భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మంచినీళ్లు, రోడ్లను బాగు చేసుకుంటున్నాం. ఒక డ్రైనేజీ వ్యవస్థ మిగిలిందని, దాన్ని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాదే’నన్నారు. స్వల్ప కాలంలో శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ స్వల్ప కాలంలో నిర్మించి, అందుబాటులోకి తెచ్చినందుకు ఎస్సార్డీపీ సీఈ, ఎస్‌సీ, సిబ్బంది అందరికీ నగర ప్రజల తరఫున కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking