తెలంగాణ ఐకానిక్ భవన్

వైట్ హౌస్ గా తెలంగాణ

తెలంగాణ ఐకానిక్ భవన్

‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’

దేశంలోనే ప్రత్యేకం

కొత్త పార్లమెంట్‌ భవనం
కన్నా విశాలమైనది

ఐజీబీసీ సర్టిఫికెట్‌
పొందిన తొలి సెక్రటేరియట్‌

భవనంలో సర్వ హంగులు..
సకల సౌకర్యాలు

ప్లానింగ్‌, విజన్‌, మానిటరింగ్‌.. అంతా సీఎందే

ఈ నెల 30న వైభవంగా ప్రారంభం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : అదొక తెలంగాణ ఐకానిక్ భవన్. సీఎం కేసిఆర్ కలల సౌధం. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. వైట్ హౌస్ ను తలపించేలా తెలంగాణ వైట్ హౌస్. దేశంలోనే ఎక్కడా ఇలాంటి సచివాలయం లేదు. తెలంగాణకు గర్వకారణం.
తెలంగాణ సచివాలయం అత్యంత సువిశాలమైనదని, ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన భవనం దేశంలో ఎక్కడా లేదు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి గోల్డెన్‌ సర్టిఫికెట్‌ పొందిన గౌరవం కూడా మన సచివాలయానికే దక్కింది. భవనంలోని హాళ్లు, డోమ్‌లు, స్కైలాంజ్‌లు దేశంలోని ఏ ఇతర సచివాలయానికీ లేవు. కేంద్రం నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా కన్నా మన సచివాలయం విశాలమైనది.

ఎన్నో ప్రత్యేకతలతో కూడిన మన సచివాలయం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట ఆత్మగౌరవ ప్రతీకగా, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 20 నెలల్లోనే సచివాలయ నిర్మాణం సాకారమైంది. ‘సచివాలయంలో మొత్తం 635 గదులు, 30 కాన్ఫరెన్స్‌ హాళ్లను నిర్మించబడ్డాయి. మంత్రులందరికీ ప్రత్యేక చాంబర్లతో పాటు కాన్ఫరెన్స్‌ హాళ్లను నిర్మించారు.విధుల్లో జాప్యం జరుగకుండా అన్నీ ఒకేచోట ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సమీకృత సచివాలయ నిర్మాణo జరిగింది.మంత్రులు, కార్యదర్శులు, సిబ్బంది ఒకేచోట ఉన్న సచివాలయం దేశంలో ఇదే మొదటిది. గతంలో ఒక్కొక్కరు ఒక్కో కార్యాలయంలో ఉండటంతో విధి నిర్వహణ, ఫైళ్ల మూవ్‌మెంట్‌లో తీవ్ర జాప్యం జరిగేది. ఇక్కడ ప్లగ్‌ అండ్‌ ప్లే వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఉద్యోగులకు అవసరమైన సకల సౌకర్యాలు ఇందులో ఉంటాయి. వారు తమ ఫైళ్లు, కంప్యూటర్లు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. ప్రతి కాన్ఫరెన్స్‌ హాలులో వీడియో కాన్ఫరెన్స్‌ కోసం భారీ తెరలను ఏర్పాటు చేశారు. సచివాలయానికి పునాదిరాయి వేసిననాడే సీఎం కేసీఆర్‌ అధికారులను పిలిచి భవనానికి అవసరమైన సామగ్రిని ముందే కొనుగోలు చేయాలని, ఎటువంటి జాప్యం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో 20 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తయింది. వాస్తవానికి పునాదిరాయి పడినప్పటినుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మాసాంతానికి 26 నెలలు అవుతుంది. ఇందులో కోవిడ్‌ కారణంగా మూడు నెలలు, కొవిడ్‌ వల్ల సొంత ఊళ్లకు వెళ్లిపోయిన కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో మూడు నెలల సమయం పట్టింది. ఇలా ఆరు నెలలు వృథా అయింది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాన్ని 20 నెలల్లో పూర్తిచేయడం రికార్డుగా చెప్పవచ్చు. ఏసీల ఏర్పాటుకు ఆరు నెలలు పట్టింది. ప్రధాన పిల్లర్లు, గుమ్మటాలకు ముందుగా పోతపోసిన నిర్మాణాల (గాల్వనైజ్డ్‌ రీఇన్‌ఫోర్స్‌ కాంక్రీట్‌, సీఆర్‌సీ) జీఆర్‌సీ పనులు కూడా బాగానే సమయం తీసుకున్నాయి.
డోమ్‌లు, డోక్‌లకు చుట్టూ ఏర్పాటు చేసిన గ్లాస్‌, స్తూపాల ఏర్పాటుకు దాదాపు ఆరునెలల సమయం పట్టింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ మైన్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్‌ శాండ్‌స్టోన్‌ను వాడారు. ముందుగా రాజస్థాన్‌లోని ఓ మైన్‌నుంచి ఈ రాయిని తెప్పించేందుకు ఒప్పందం చేసుకోగా, అదే మైన్‌ నుంచి పార్లమెంటు నిర్మాణానికి కూడా రెడ్‌ శాండ్‌ స్టోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో మన సచివాలయం కోసం మరో మైన్‌ నుంచి కొనుగోలు చేశారు.సచివాలయ నిర్మాణంలో 3500 క్యూబిక్‌ మీటర్ల రెడ్‌ శాండ్‌ స్టోన్‌ను 1000 లారీల ద్వారా ఇక్కడికి తరలించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ గోడ నిర్మాణం పూర్తిగా ఈ రెడ్‌ శాండ్‌ స్టోన్‌తోనే నిర్మించారు. సచివాలయంలో రిసెప్షన్‌ హాలు, మీడియా హాలు, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎంలు, బస్‌ కౌంటర్‌, రైల్వే కౌంటర్‌, క్యాంటీన్‌, అసోసియేషన్‌ బిల్డింగ్‌, డిస్పెన్సరీ, మసీదు, దేవాలయం, చర్చి తదితరమైనవి ఉన్నాయి. 300 సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు షిఫ్టుల్లో పనిచేసేందుకు 300 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. ఈ సీసీ కెమేరాలను అనుసంధానం చేస్తూ ఐదో అంతస్తులో ఓ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.  ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ద్వారా గోల్డెన్‌ సర్టిఫికెట్‌ పొందిన మొదటి ఏకైక సచివాలయంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌కు అరుదైన గౌరవం దక్కింది. విద్యుత్‌ వాడకాన్ని తగ్గించేందుకు పార్కింగ్‌ స్థలంలో సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 28 ఎకరాల స్థలంలో కేవలం రెండున్నర ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేసి, మిగిలిన స్థలాన్ని పచ్చదనం, పార్కింగ్‌, రోడ్ల కోసం వినియోగించడం విశేషం.
సచివాలయంలో 2000 మంది పనిచేయనున్నారు. తాగునీటికోసం 120 కిలోలీటర్ల్ల (కేఎల్‌డీ) సామర్థ్యంగల సంపు, ఇతర అవసరాల కోసం 180 కిలో లీటర్ల సంపులు రెండు, వర్షపునీటిని నిల్వచేసేందుకు 200 కిలో లీటర్ల సామర్థ్యంగల మరో సంపును ఏర్పాటుచేశారు. ఏసీ ప్లాంటుకు అవసరమయ్యే నీరు, గార్డెనింగ్‌ కోసం, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి నీటి కొరత లేకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు ఉన్నాయి. సచివాలయానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఇందులో తూర్పు వైపు నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు వెళ్లవచ్చు. పశ్చిమం వైపు ఏర్పాటుచేసిన ద్వారాన్ని అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించారు. ఈశాన్యంలోని ద్వారం గుండా అధికారులు, ఉద్యోగులు వెళ్తారు. వారికి పార్కింగ్‌ కూడా అక్కడే ఉంది. ఆగ్నేయ ద్వారాన్ని సందర్శకులకు ప్రత్యేకించారు. వారికి ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యం, పాసులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 617 కోట్లు మంజూరుచేసిన విషయం తెలిసిందే. అయితే, నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఆరు శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. స్టీలు, సిమెంటు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వ్యయం 20-30 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భవనం నిర్వహణకు గాను ప్రతి చదరపు అడుగుకు సుమారు రూ. 10 చొప్పున మొత్తం 10 లక్షల చదరపు అడుగులకు నెలకు రూ. కోటి వరకూ ఖర్చవుతుందని అంచనా. కేంద్రం నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా వైశాల్యం 6,98,270 చదరపు అడుగులు కాగా, మన సచివాలయాన్ని 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత విశాలమైన, సమీకృత సచివాలయం లేదు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్‌ చేయడంతోపాటు గదుల ఎత్తు కూడా 14 అడుగులుగా నిర్మించారు. ముందూవెనుక భాగంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోర్టికోల ఎత్తు 42 అడుగులు. కుతుబ్‌మినార్‌ కన్నా ఎత్తైన మన సచివాలయంలో ఆరో అంతస్తులో 28 అడుగుల ఎత్తైన రెండు హాళ్లను నిర్మించారు. ప్రత్యేక అతిథులు, విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, విందుల కోసం వీటిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. లోవర్‌ ఫ్లోర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ తరువాత ఆరు అంతస్తులు కాగా, ప్రధాన డోమ్‌లు ఉన్నచోట భవనం 11 అంతస్తులుగా ఉంది. ప్రధాన డోమ్‌ల వైశాల్యం 2,500 చదరపు అడుగులు. డోమ్‌ల ఎత్తు 48 అడుగులు కాగా, వయా 50 అడుగులు. మొత్తం భవనంలో 34 డోమ్‌లను నిర్మించారు. సచివాలయానికి ఇరువైపులా మొత్తం 24 లిఫ్టులు ఉండగా, అందులో ఎనిమిది స్కైలాంజ్‌వరకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. అప్పటికే ఆయా శాఖలకు కేటాయించిన అంతస్తుల్లోకి సామాగ్రిని తరలించారు. ఈనెల 30న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి కొత్త సచివాలయంలో కొలువు తీరి పరిపాలన సాగించేందుకు ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking