ఇంటర్ పరీక్షల్లో దుమ్మురేపిన గురుకుల విద్యార్థులు
92శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకుల విద్యాసంస్థలు
ఇంటర్ ఫలితాలపై సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటడం పట్ల రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. గురుకుల కాలేజీల్లో మొత్తం 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గొప్ప గర్వకారణం అన్నారు.ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్ కాగా.. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(KGBV )77%, ట్రైబల్ 84 %, ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించడమే విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ప్రయివేట్ కాలేజీల్లో కన్నా గురుకుల విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరిచేందుకు ప్రోత్సహించిన బోధన సిబ్బందిని అభినందించారు. ఇప్పటికే గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తుండగా.. మరి కొందరు ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందరని గుర్తు చేశారు.
ఈ ఫలితాలు చూసి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివించేందుకు ముందుకు రావాలన్నారు. పదో తరగతి ఫలితాల్లోను మంచి రిజల్ట్స్ వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశా భావం వ్యక్తం చేశారు.