పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
*ఆటోను ఢీకొన్న లారీ
* ఆరుగురు కూలీలు దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు
* మృతులంతా దామరచర్ల మండలంలోని నరసాపురం గ్రామానికి చెందినవారు
* బాధిత కుటుంబాలను పరామర్శించిన
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని పల్నాడు జిల్లా పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కోతకు వెళ్తున్న కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలను అందిస్తున్నారు.

మృతులంతా మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలోని నరసాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పరామర్శించారు. ప్రమాదం బారినపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సేవలకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. అదే విధంగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు కూలీలను భాస్కర్ రావు పరామర్శించారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.