పకడ్బందీగా ప్రజా పాలన

పకడ్బందీగా ప్రజా పాలన

28 నుంచి జనవరి 6 వరకు ప్రణాళిక

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకార,చేనేత,జౌళి శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న
“ప్రజా పాలన” కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార,చేనేత,జౌళి శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.

మంగళవారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజాపాలన కార్యక్రమం ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ఆయన సన్నాహక సమావేశానికి హాజరైనారు.

ఈ సందర్భంగా సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా కలెక్టర్లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారని అన్నారు. ఈనెల 28వ తేదీ నుండి వచ్చే నెల 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రణాళిక బద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలని, అందుకోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని, బాధ్యతాయుతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, దరఖాస్తులు నింపే విధంగా యంత్రాగాన్ని సమాయత్తం చేసుకోవాలని, అలాగే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని, సాధారణ దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రద్దీ ఎక్కువ ఉన్నచోట టీములను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కార్యక్రమాన్ని అందరూ సమన్వయ భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ…. వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు నెరవేర్చాలని అన్నారు. ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నామని, యావత్ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, అందరికీ ఆరోగ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించినట్లు తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలుపెడతామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాల విషయంలో పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని, అధికారులు కూడా న్యాయంగా ధర్మంగా చట్టపరంగా ముందుకెళ్లాలని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ మంది ఉన్నచోట ముందే తగిన జాగ్రత్తలు చేసుకోవాలని, పెద్ద గ్రామపంచాయతీలలో, మున్సిపల్ వార్డులలో క్యూ లైన్లు ఏర్పాటుచేసి ఎక్కువ కౌంటర్లతో నియంత్రించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీటిపారుదల రంగంలో అన్యాయం జరిగిందని, గత పదేళ్లలో ఒక ఎకరానికి కూడా నీరు తీసుకురాలేదని, ఈ ప్రభుత్వం అలాకాకుండా నీటి పారుదల రంగానికి ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని తెలిపారు.

ప్రజా ప్రతినిధులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రేషన్ బియ్యం సంబంధించి ప్రతి కిలో బియ్యాన్ని 39 రూపాయలు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని, దురదృష్టం ఏమిటంటే ఆ బియ్యం రీసైకిలింగ్ అవుతుందని, పౌల్ట్రీలకు వెళుతున్నదని, ఇది దుర్మార్గమైన విషయమని,రీ సైక్లింగ్ లో చేస్తున్న అసాంఘిక శక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రేషన్ సరఫరా విషయంలో ప్రక్షాళన చేస్తామని నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… అభయ హస్తం క్రింద ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ప్రారంభించుకున్నామని తెలియజేస్తూ, పాలసీలను ప్రజాప్రతినిధులమైన మేము తయారు చేస్తామని, వాటిని ప్రతి పేదవారికి అందించేది మీలాంటి అధికారులేనని అన్నారు. పటిష్టమైన ఏర్పాట్లతో, తగిన టీములతో ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తులు నింపేందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు, మంచినీటి సౌకర్యం, టెంట్లు, కుర్చీలు, వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామ పంచాయతీలలో దరఖాస్తుదారులు ఎవరు కూడా మిస్ కావద్దని, అందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదవాని వద్దకు ప్రభుత్వ పథకాలు తీసుకుపోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. అందరం భాగస్వాములమై తెలంగాణను బాగు చేసే విషయంలో భాగస్వాములము కావాలని, నిర్బంధ పాలన నుండి ప్రజా పాలన దిశగా నడుద్దామని అన్నారు. అధికారులు ఎక్కువసేపు పనిచేయాలని తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు. జిల్లాలో యువతను పెడదారి పట్టించే బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు.

ఈ సందర్బంగా నల్గొండ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 28 నుండి జనవరి 06 వరకు నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం ప్రజా పాలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అంతటా గ్రామ పంచాయతీ లలో,మున్సిపాలిటీ లలో మొత్తం
151 టీమ్స్ ఏర్పాటు చేసామని అన్నారు.
844 గ్రామపంచాయతిలలో 112 టీమ్స్ అలాగే ఎనిమిది మున్సిపాలిటీలలో 182 వార్డులో లలో 39 టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ సందర్బంగా సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 28 నుండి జనవరి 06 వరకు నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం ప్రజా పాలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అంతటా 58 టీమ్స్ ఏర్పాటు చేసామని 475 గ్రామపంచాయతిలలో 46 టీమ్స్ అలాగే ఐదు మున్సిపాలిటీలలో 141 వార్డులలో 12 టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజా పాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజు 2 షిఫ్ట్ లలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు అలాగే మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని నిర్వహిస్తానని తెలిపారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం అధికార బృందాలచే గ్రామసభలు నిర్వహిస్తామని తెలిపారు. యాదాధ్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీ ఏర్పాట్లతో ప్రజల వద్దకు తీసుకు వెళ్తామని, ప్రభుత్వం ఆశించే లక్ష్యాలను నెరవేరుస్తామని తెలిపారు. 2 లక్షల, 18 వేల 807 కుటుంబాలకు సంబంధించి మున్సిపాలిటీలలో 14, గ్రామీణంలో 37 కలిపి మొత్తం 51 టీములతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఇందుకోసం 1961 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రేపటినుండి గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని, గ్రామసభలో ఎవరైనా దరఖాస్తుదారులు ఇవ్వలేకపోతే వారి వద్ద నుండి తిరిగి తీసుకుంటామని, ఎవరైనా ఆ సమయంలో రాకపోయినా తర్వాత కూడా వారి వద్ద నుండి స్వీకరిస్తామని తెలిపారు.

సన్నాహక సమావేశంలో ప్రభుత విప్ బీర్ల ఐలయ్య,, కుంభం అనిల్ కుమార్ రెడ్డి,
బాలు నాయక్, వేముల వీరేశం, నల్లమాద పద్మావతి, బి.లక్ష్మారెడ్డి, కె. జయవీర్ రెడ్డి, మందుల సామెల్, నల్గొండ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే, సూర్యాపేట ఇంచార్జి కలెక్టర్ ప్రియాంక, నల్గొండ ఎస్.పి. అపూర్వ రావు, యాదాద్రి భువనగిరి డి.సి.పి. రాజేష్ చంద్ర, సూర్యాపేట ఏ.ఎస్.పి.నాగేశ్వర రావు,అదనపు కలెక్టర్ లు రెవెన్యూ జె.శ్రీనివాస్,భాస్కర రావు, వెంకట రెడ్డిలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking