ఫోటోకు జీవం… ఫోటో గ్రాఫర్

ఫోటోకు జీవం… ఫోటో గ్రాఫర్

ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అంకిత భావంతో సృజనాత్మకoగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశమును అర్థవంతంగా తెలియజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రతి రోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవక పోయినా , అన్ని పేజీలలోని ఫోటోలను చూసి, ఆ వార్హలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు.     5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లకు మేమెంటో, శాలువా, నగదు పురస్కారాలను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు.

తెలంగాణ పాలనలో మార్పుకు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం అమలుకు గత 8 నెలలుగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఫోటోగ్రఫీ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.

సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఫోటోతో కూడిన వార్తకు పరిపూర్ణత చేకూరుతుందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా హాజరైనారు. క్షేత్ర స్థాయిలో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులను భరించి ఫొటోగ్రాఫర్లు పనిచేస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టుల కంటే ఎక్కువ కష్టపడి విధులు నిర్వహిస్తారని తెలిపారు. మనిషిని ఆలోచింప జేసే శక్తి ఫోటోలకు వుంటుందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల ను రాష్ట్ర ప్రభుత్వo గౌరవిస్తుందని పేర్కొన్నారు.
5 కేటగిరీలలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే పోటీలలో 101 మంది 990 ఫోటోలను పంపినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ యం. హనుమంతరావు తెలిపారు. ఫోటోగ్రఫీ, జర్నలిజం లలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ప్రతి కేటగిరీలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు 5 కన్సొలేషన్ బహుమతులకు ఫోటోలను ఎంపిక జేసినట్లు తెలిపారు.

ఫోటోగ్రాఫర్లు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అలాగే
ఎఫ్ డీసి ఈడి కిషోర్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు డిఎస్ జగన్, డి శ్రీనివాస్, కే వెంకట రమణ, సిఐ ఈ రాధా కిషన్ , మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, శాఖ ఫోటోగ్రాఫర్లు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking