ఐక్యతకు చిహ్నం..
ఆత్మీయ సమ్మేళనం
2న క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం
దీపక్ జాన్, బత్తుల లక్ష్మారెడ్డిలు రాక
ముండ్లగిరి కాంతయ్య, చిలుక విద్యాసాగర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రైస్తవుల నడుమ ఐక్యతకు చిహ్నం… ఆత్మీయ సమ్మేళనం. సహోదరులు ఐక్యత కల్గి నివసించుట ఎంత మేలు… ఎంత మనోహరం. అన్ని సంఘాల సమ్మిళితంగా ఐక్యతను చాటేందుకు ఈ నెల 2న క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు హాజరు కానున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని విజయ గార్డెన్స్ లో జరగనున్న ఆత్మీయ సమ్మేళనంలో దైవజనులు వినయ్ దీప్ కాటంరాజు దైవ సందేశం అందించనున్నట్లు మిర్యాలగూడ క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముండ్లగిరి కాంతయ్య, మిర్యాలగూడ క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిలుక విద్యాసాగర్ లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్చను కొద్ది మంది కుట్ర పూరితంగా ఆటంకం కల్పిస్తూ మత స్వేచ్చకు విఘాతం కలిగించే పరిస్థితులు నెలకొన్నది విదితమే. స్వేచ్చాయుత వాతావరణంలో సంఘాల పరిచర్యను సాగించేందుకు… ఎదురయ్యే ఆటంకాలను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించి ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనం దోహద పడనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం తెలంగాణలోనూ ఇప్పించేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. పల్లెలు, పట్టణాల్లో సమాధుల తోటలు, చర్చిల నిర్మాణానికి తగిన ఆర్ధిక చేయూత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనం దోహద పడనుంది. అర్వులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని సంఘాలకతీతంగా సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘస్తుల అంతా అత్యధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని, క్రైస్తవుల ఐక్యతను మరింతగా చాటేందుకు కృషి చేయాలని మిర్యాలగూడ క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముండ్లగిరి కాంతయ్య, మిర్యాలగూడ క్రైస్తవ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిలుక విద్యాసాగర్ లు కోరారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసేందుకు సమిష్టి కృషి అవసరం ఉందని కోరారు. ఐక్యతతోనే మన సమస్యల సాధన సాధ్యమన్నారు.