జాతిపిత ఆశయాలను సాధించాలి

జాతిపిత ఆశయాలను సాధించాలి
* మహాత్ముడి అడుగుజాడల్లో నడవటమే నిజమైన నివాళి
* సంక్షేమ పథకాల అమలులో దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ సర్కార్
* నల్లమోతు భాస్కర్ రావు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను సాధించేందుకు యువత కృషి చేయాలని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడవటమే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా సాగర్ రోడ్డులోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆంగ్లేయుల బానిస, నిరంకుశ పాలన నుంచి అఖండ భారతావనిని విముక్తి కల్పించిన గొప్ప స్వతంత్ర్య సమరయోధుడు గాంధీ అని అన్నారు.

సత్యం, అహింస, ధర్మం,శాంతియుత మార్గాల్లో నడిచిన బాపూజీ తన కలలను సాకారం చేసుకున్నారని అన్నారు. అంటరానితనం, కుల, మత వివక్షల్లేని సమాజస్థాపన కోసం కృషి చేశారని అన్నారు. సత్యం, అహింస అనే ఆయుధాలనే ఆయన నమ్ముకున్నారని చెప్పారు. సత్యాగ్రహం, సహాయనిరాకరణ అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి చెందుతుందనే సిద్ధాంతాన్ని గాంధీ నమ్మేవారని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సుపరిపాలన అందించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల,పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కేసీఆర్ సర్కార్ పనితీరుకు ప్రతిఫలంగా ప్రతి ఏడాది స్వచ్చ్ భారత్ అవార్డులు వరించాయని అన్నారు. మహాత్ముడి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి తెలుసుకోవాలంటే గాంధీ ఆత్మకథ ‘ సత్యాన్వేషణలో నా ప్రయోగాలు’ అనే పుస్తకాన్ని యువత కచ్చితంగా చదవాలని భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking