వారసత్వo
ఇంకెన్నాళ్ళు?
డబ్బున్నుల్లోకేనా టిక్కెట్లు !
రాచరికపు
రాజకీయాలొద్దు !!
జూబ్లీ హిల్స్ మార్పు
మొదలవ్వాలి
మట్టిమనిషి వేనేపల్లి
పాండురంగారావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వారసత్వ ప్రజాప్రతినిధుల ఎన్నిక, డబ్బు రాజకీయాలు, రాజకీయ పార్టీలు
మానుకోవాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు కోరారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు పదవీ కాలం మధ్యలో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వకూడదు, ఇచ్చినా వాళ్ళు తీసుకోకూడదన్నారు.వాళ్లిచ్చినా, వీళ్ళు తీసుకున్న ప్రజలు గెలిపించ కూడదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల నుంచే మార్పు మొదలవ్వాలి. ఆఅనవాయితీ తుదముట్టించాలన్నారు. రాచరికాన్ని రాజుల పాలనను అంతమొందించుకుని, ప్రజాస్వామ్య ప్రజాపాలనకు రేపో మాపో వందేళ్లు పూర్తి చేసుకుంటున్నా ఇంకా రాచరికపు అవినీతి అవలక్షణాలు వదిలించుకోవాలన్నారు.
రాజకీయ పక్షాలు ఎన్నికల్లో నిజాయితీగా పాల్గొనడం లేదన్నారు. అనేక ప్రలోభాలకు పాల్పడుతున్నావన్నారు. పదవీ కాలం మధ్యలో ప్రజా ప్రతినిధులు చనిపోతే సానుభూతి ఓట్ల కోసం మధ్యంతర ఉపఎన్నికల్లో కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వడం. మాజీ సీఎం టి.అంజయ్య భార్య మణెమ్మ, మావోయిస్టుల చేతుల్లో మరణించిన మాగుంట సుబ్బారామిరెడ్డి, భార్య పార్వతమ్మ, ఎలిమినేటి మాధవ రెడ్డి భార్య ఉమ, ధీరావత్ రాగ్యానాయక్ భార్య భారతీబాయి, ప్రత్యర్థుల చేతిలో హత్యగావించబడ్డ వంగవీటి మోహన రంగా, భార్య రత్నకుమారి పరిటాల రవి భార్య సునీత, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మలు, ఆనాటి పరిస్థితుల్లో వాళ్లకు సానుభూతితో టికెట్లు ఇవ్వడం ప్రజలు గెలిపించడం జరిగిందన్నారు. దానితో ఇది అనవాయితీగా.. ఒక హక్కుగా మారుతూ వస్తుందన్నారు. పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే, భార్య సుచరితరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే, బిఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వర్ రావును నిలబెట్టి గెలిపించుకుందన్నారు. ఇదే బిఆర్ఎస్ దే, అదే అనవాయితీగా సానుభూతి ఓట్ల కోసం, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణిస్తే భార్య సుజాతకు టికెట్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునoదనరావు గెలిచాడన్నారు. ఆ మధ్య మరణించిన కoటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణిస్తే కూతురు లాస్య నందితకు ఇవ్వడం ఆమె గెలవడం, ఆమె కూడా ప్రమాదంలో మరణించడం, ఇవ్వాళ జుబ్లీ హిల్స్ లో ఈ మధ్య మరణించిన మాగంటి గోపినాథ్ భార్య సునీతకు అదే సానుభూతి ఓట్లతో గెలవడానికి టికెట్ ఇవ్వాలనుకుంటుంది ఈ అనవాయితీని ఆపివేయాలి. పార్టీలు కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలన్నారు.వారసత్వమనేది కుటుంబానికి మాత్రమే పరిమితమన్నారు. అది రాజకీయాల్లో ప్రజాజీవితంలో పాలనలో ఉండకూడదన్నారు. ఉండవలసిందల్లా పార్టీకోసం పనిచేయడం మాత్రమేనన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పైసా పనిచేయకుండా కేవలం కుటుంబ సభ్యుల కీర్తి ప్రతిష్టలను వాడుకొని ప్రజా ప్రతినిధులు కావడం ఆత్మాభిమానమున్నవాళ్లు చేయవలసింది కాదన్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి మంచిది కాదన్నారు.అలా టికెట్స్ ఇవ్వడమనేది పార్టీలకు మంచిది కాదన్నారు. పార్టీ కోసం ప్రజలకోసం పనిచేసిన వాళ్ళను వదిలేసి సానుభూతి కక్కుర్తితో ప్రజలను మానసిక ఒత్తిడికి గురిచేసి ఓదార్పు సానుభూతిలోకి నెట్టి వేయడం క్షమించరాని విషయమన్నారు. ఇప్పటి వరకు అలా పోటి చేసి గెలిచిన వాళ్ళు ప్రజలను ఉద్దరించిన దాఖలాలు కూడా లేవన్నారు. చనిపోయిన వాళ్ళు పేదవాళ్ళయితే పార్టీలు ఆర్ధికంగా ఆదుకోవాలన్నారు. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు సహాయం చేయాలి అంతే గాని ఇలా ప్రజల మీద రుద్ద కూడదన్నారు.నియోజక వర్గ మంచి చెడ్డలు బరువు బాధ్యతలు వారసత్వoగా ఇవ్వకూడదన్నారు. రాజకీయ పార్టీలు సానుభూతి ఓట్ల కోసం కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వకూడదన్నారు.ఇచ్చినా ఆ కుటుంబసభ్యులు తీసుకోకూడదన్నారు. పార్టీలు ఇచ్చినా, తీసుకున్నా ప్రజలు గెలిపించకూడదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి, వారసత్వ కుటుంబ సభ్యులను గెలిపించవద్దన్నారు.జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టాలన్నారు. ఎన్నికల్లో, రాజకీయాల్లో, ప్రజా పాలనలో మార్పునాశించే వాళ్ళు తప్పకుండ ఈ విషయంలో కలిసి రావాలని కోరారు.ప్రజల ఇష్టాయిష్టాలను గుర్తించకుండా 2001 నుంచి గెలుపు వంకతో డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చే జబ్బు మానుకోవాలని కల్వకుoట్ల చంద్రశేఖర్ రావును కోరారు.