రోడ్డెక్కిన అన్నదాతలు

ధాన్యానికి ధర తగ్గింపు.. తిరుమలగిరిలో రోడ్డెక్కిన అన్నదాతలు

* ఒక్కరోజే రూ. 800 తగ్గించిన దళారులు.. మార్కెట్ సిబ్బందితో కుమ్మక్కయ్యారని ఆగ్రహం

* మార్కెట్‌కు పోటెత్తిన 60 వేల ధాన్యం బస్తాలు.. కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

* ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్.. భారీగా పోలీసుల మొహరింపు

తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దళారుల దోపిడీ, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అన్నదాతలు ఆగ్రహోదగ్రులయ్యారు. ధాన్యానికి సరైన మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం రైతులు ప్రధాన రహదారిపైకి వచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. మార్కెట్ సిబ్బంది, వ్యాపారులు కుమ్మక్కై రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.


ఒక్కరోజే రూ. 800 కోత.. పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా?
మార్కెట్ చరిత్రలోనే లేని విధంగా దళారులు సిండికేట్‌గా మారి, ఒక్కరోజులోనే క్వింటాల్ ధాన్యం ధరను ఏకంగా రూ. 800 వరకు తగ్గించారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు, మూడు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా, తిండి తిప్పలు మాని మార్కెట్ యార్డులోనే ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని కన్నీరుమున్నీరయ్యారు.

తీరా కాంటాలు పెట్టే సమయానికి తమ ఇష్టానుసారంగా ధరలను తగ్గించి రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. మార్కెట్ సిబ్బంది కనీస సమయపాలన పాటించడం లేదని, కాంటాలు వేయడంలో కావాలనే నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, సోమవారం ఒక్కరోజే మార్కెట్‌కు ఊహించని విధంగా దాదాపు 60 వేల బస్తాల ధాన్యం పోటెత్తడంతో యార్డంతా ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ రద్దీని ఆసరాగా చేసుకునే దళారులు ధరల తగ్గింపునకు తెగబడ్డారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. పోలీసుల బందోబస్తు
రైతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించడంతో తిరుమలగిరి ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులతో పోలీసులు, మార్కెట్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి, తక్షణమే కాంటాలు పూర్తి చేసేలా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking