చెన్నూర్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
– చెన్నూర్ సమగ్ర అభివృద్ధికి రూ.70 కోట్లతో పనులు
– గోదావరి పుష్కరాల పనులు, పర్యాటక అభివృద్ధి, గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యల తక్షణ పరిష్కారం
– రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, లైటింగ్‌కు ప్రాధాన్యం.. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
– రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల,అక్షిత బ్యూరో :
చెన్నూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. సోమవారం చెన్నూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ పట్టణానికి నూతన రూపు తీసుకురావడమే లక్ష్యంగా రహదారుల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యాపారుల సహకారంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి బైపాస్ రోడ్డును రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన వ్యాపారులకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, ప్రస్తుతం 20 దుకాణాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన వ్యాపారుల కోసం మరో 50 దుకాణాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
రూ.15.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
పట్టణంలో ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జంక్షన్ నుంచి పెద్ద చెరువు (రావి చెట్టు) వరకు రూ.5.50 కోట్లతో బీటీ రోడ్డు విస్తరణ, ఇరువైపులా డ్రైనేజీలు, సెంట్రల్ మీడియన్, లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహంకాళి ఆలయం నుంచి జాతీయ రహదారి–63 (గోదావరి రోడ్డు) వరకు రూ.3.50 కోట్లతో సీసీ రోడ్డు విస్తరణ, జాతీయ రహదారి–63 నుంచి గోదావరి పుష్కర ఘాట్ వరకు రూ.6 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ మీడియన్, లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుష్కర ఘాట్ సమీపంలో రూ.50 లక్షలతో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
గ్రామీణ రహదారులపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినందున పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులతో పాటు శ్మశానవాటికలకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కోటపల్లి ప్రాంతంలో ఎస్సీ వసతి గృహానికి అవసరమైన నిధుల కేటాయింపు, అభివృద్ధి చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా జైపూర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మొసళ్ల పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మందమర్రి ప్రాంతంలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల సౌకర్యం కల్పించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్మాణాల్లో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని, లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సుద్దాల గ్రామంలో ఇసుక సరఫరాకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులు ప్రారంభించని లేదా నెమ్మదిగా కొనసాగుతున్న ఇళ్ల లబ్ధిదారులకు సహకరించాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ చెన్నూర్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రెండు వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, మూడో ట్యాంకు పనులను త్వరగా పూర్తి చేసి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో సోలార్ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా సౌకర్యాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వేలాలలో పుష్కర ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన
అనంతరం జైపూర్ మండలం వేలాల గ్రామంలో మంత్రి గడ్డం వివేకానంద మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గోదావరి తీరంలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.4.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుష్కర ఘాట్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
