ఏలినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

ఏలినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– నీర్నెముల గ్రామసభలో సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి పిలుపు

– నీటి పొదుపు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి.. ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం

నీర్నెముల, అక్షిత ప్రతినిధి:

ఏలినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎదురయ్యే కరువు, నీటి ఎద్దడి, పంట నష్టాలు, విద్యుత్ కొరతను అధిగమించేందుకు గ్రామస్థులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నీర్నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన ఏలినో ప్రభావం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. రాబోయే ఎనిమిది నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థులంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు.

మునగ సాగుతో రైతులకు ప్రయోజనం

వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ తక్కువ నీటితో సాగు చేయగల మునగ పంటను ప్రత్యామ్నాయ పంటగా ప్రోత్సహించాలని సూచించారు. మునగ ఆకుల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, రైతులు ఈ పంట సాగుపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు

వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటి వద్ద, వ్యవసాయ పొలాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఆశిష్ రాఘవ, ఏపీఓ వెంకన్న సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచుకోవచ్చని వివరించారు.

నీరు, విద్యుత్ పొదుపు అందరి బాధ్యత

తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌ఈఓ గోపాల్ సూచించారు. వ్యవసాయంలో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి నీటి పొదుపు పద్ధతులను వినియోగించుకోవాలని తెలిపారు. ఎండల తీవ్రత సమయంలో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, సాధ్యమైనంత వరకు పగటిపూట విద్యుత్ మోటార్ల వినియోగాన్ని తగ్గించేందుకు రైతులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, లైన్‌మెన్ నవీన్ కోరారు. ఎండ తీవ్రత వల్ల మనుషులు, పశువులకు కలిగే నష్టాలు, వడదెబ్బ నివారణ చర్యలపై వెటర్నరీ అసిస్టెంట్ రఘు, హెచ్‌ఎం రవి అవగాహన కల్పించారు. ఈ గ్రామసభలో ఎంపీఓ ఎండీ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఏపీఓ వెంకన్న, జీపీఓ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మిరియాల లక్ష్మి, వార్డు సభ్యులు ముత్యాల కిషన్, పెరుమాండ్ల నవీన్, బోయిని ఐలమ్మ, కట్ట సాత్విక, వీబీకే ముత్యాల రాణి, అంగన్‌వాడీ టీచర్లు మంగమ్మ, సౌజన్య, మాజీ ఉపసర్పంచ్ చల్ల సత్య ప్రకాష్, నాయకులు నోముల విష్ణు, బోయిని మల్లేష్, పంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, చిన్నపాక రాంబాబు, నోముల శంకర్, నోముల యాదయ్య, చిప్పలపల్లి పద్మ, వీఆర్ఏ చల్ల ముత్యాలు, పాల సంఘం చైర్మన్ ఆవుల సైదమ్మతో పాటు గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఎనిమిది నెలల్లో ఏలినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking