తిరుమలగిరి ఫాతిమా స్కూల్లో యాజమాన్య నిర్లక్ష్యం
చీకటిలో ఒకటో తరగతి విద్యార్థికి తీవ్ర గాయం, తల్లిదండ్రుల ఆందోళన
తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి పట్టణ కేంద్రంలో గల ఫాతిమా హైస్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

పాఠశాల సమయం సాయంత్రం నాలుగు గంటలకే ముగిసినప్పటికీ, విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా గంటల తరబడి స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఆరు, ఏడు గంటలవుతున్నా కనీసం లైట్లు కూడా వేయకుండా చిన్న పిల్లలను చీకట్లోనే కూర్చోబెట్టారు.
ఈ క్రమంలో ఒకటో తరగతి చదువుతున్న బట్టు రుద్రాంచచ్ నందన్ అనే విద్యార్థి చీకటిలో కాలుజారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని యాజమాన్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. గాయపడిన బాబు పరిస్థితిపై, లైట్లు వేయకుండా చీకటిలో ఉంచడంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా, ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

కనీస క్రమశిక్షణ, బాధ్యత లేకుండా పాఠశాలను నడుపుతూ చిన్నారి ప్రాణాలతో ఆడుకుంటున్న ఫాతిమా హైస్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.