లిక్కర్ స్కాంపై కెసిఆర్ స్పందించరేం.?*
*అమరుల తెలంగాణ..
స్కాంల తెలంగాణగా మారింది…
*దేశాన్ని నేరస్థులు పాలిస్తున్నారు..
బహుజన్ సమాజ్ పార్టీ,
రాష్ట్ర అధ్యక్షులు
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
,
ఖమ్మం, అక్షిత బ్యూరో :
ప్రతి అంశం పట్ల గంటల తరబడి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే ముఖ్యమంత్రి కెసిఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాంపై ఎందుకు పెదవి విప్పడం లేదని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పులి బిడ్డలు అని ప్రకటించిన సిఎం లిక్కర్ స్కాంలో కూతురిని కాపాడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. శ్రీకాంతచారి వంటి ఎంతోమంది అమరుల తెలంగాణ నేడు స్కాంల తెలంగాణగా మారిందన్నారు. విద్య,ఉద్యోగాలు మరియు పారదర్శక పరిపాలనకు చిరునామా కావాల్సిన తెలంగాణ, నేడు మోసాలు,అవినీతి తెలంగాణకు చిరునామాగా మారిందన్నారు. వందలకోట్ల అవినీతి జరిగిన కేసులో సిబిఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు.
చిన్న చిన్న కేసులకు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారులు,కవిత కేసులో ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు.ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మరోపక్క బిజెపి పార్టీకి చెందిన బిఎల్ సంతోష్ వందలకోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం రాజ్యాంగ విరుద్దమన్నారు.ఈ దేశాన్ని అవినీతిపరులు,నేరస్థులు పాలిస్తున్నారని ఆరోపించారు. కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే నిజాయితీ,పారదర్శక,సమాన అవకాశాల పరిపాలన అందిస్తుందని ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంటే,బిజెపి ప్రభుత్వం కనీసం బిసి కులగణన చేయడం లేదని విమర్శించారు. తమిళనాడు,జార్ఖండ్,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రలలోవలే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ దూసుకుపోతుందని,రాబోయే ఎన్నికల్లో బిఎస్పి ఖమ్మంలో విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.