
గిరిజన బిడ్డకు మళ్ళీ డీసీసీ పీఠం
రెండోసారి మళ్లీ పగ్గాలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : గిరిజన బిడ్డ కేతావత్ శంకర్ నాయక్ కు తెలంగాణ పీసీసీ మళ్ళీ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పగ్గాలు కట్టబెట్టింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి కేతావత్ శంకర్ నాయక్ నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ.. నల్లగొండ డీసీసీ పీఠం మళ్లీ శంకర్ నాయక్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ నియోజక వర్గంలోని దామరచర్ల మండలానికి చెందిన శంకర్ నాయక్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అనుంగు శిష్యుడు కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయునిగా ఉంటూ ఎంపీపీ, జడ్పీటీసీగా ప్రజాసేవ చేశారు. అలాగే సాత్విక.. స్నేహ స్వభావం కలిగిన శంకర్ నాయక్ చేసిన పార్టీ సేవలను గుర్తించిన అధిష్టానం 2019 సంవత్సరంలో ప్రధమంగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించింది. జిల్లా అధ్యక్షునిగా శంకర్ నాయక్ గడిచిన నాలుగేళ్లుగా అందరిని కలుపుకొని పోతూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుండడంతో మరోసారి డీసీసీ అధ్యక్షునిగా శంకర్ నాయక్ కు అధిష్టానం అవకాశం కల్పించింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన తనకు రెండోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు శంకర్ నాయక్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డీసీసీఅధ్యక్షునిగా శంకర్ నాయక్ మరోసారి నియామకం కావడం పట్ల మిర్యాలగూడ నియోజ కవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, ఎన్ఎస్ఎయూఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్, వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, గాజుల శ్రీనివాస్, నాయకులు బొంగర్ల వినోద్, అంజి తదితరులు ఉన్నారు.