
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
సీఎం కేసిఆర్ కు మంద కృష్ణ మాదిగ లేఖ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
9 ఏళ్లకు చేరువైన జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, ఆయా సమస్యలను పరిష్కరించి జర్నలిస్టులకు చేయూత నందించాలేని మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద సాము లాంటిదని, నాడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులంతా ఊపిరిలుదారన్నారు. ఉద్యమంలో ముగ్గురు పోతే ముట్టడి… నలుగురు పోతే ఆందోళనగా వార్తలు రాసి ఉద్యమానికి ఆసరాగా నిలిచారన్నారు. ఆంధ్రా మేనేజ్ మెంట్ ల సారథ్యంలో ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలు ఉన్నప్పటికి… ఆయా పత్రికల్లో పనిచేసే కంట్రిబ్యూటర్ నుంచి ఎడిటర్ల స్థాయి వరకు తెలంగాణ జర్నలిస్టులు ఉండడంతో అవసరమైతే ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమంలో క్రియా శీలక భూమిక పోషించిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. అలాంటి జర్నలిస్టులకు తెలంగాణ సిద్ధించి 9 ఏళ్లకు చేరువైనప్పటికి ఇంకా జర్నలిస్టుల సమస్యలు పెండింగ్ లోనే నత్తకు నడక నేర్పించే పరిస్థితి దాపురించిందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేసిఆర్ సర్కార్ పెద్దపీట వేస్తుందని చెపుతున్నప్పటికి కలం యోధుల కష్టాలు అలాగే మగ్గుతున్నయన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ మొదలు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇళ్ళ స్థలాలు, పెన్షన్ స్కీమ్, జర్నలిస్ట్ భవన్, చిన్న పత్రికలకు గుదిబండగా పరిణమించిన 239 జీఓ, నాలుగేళ్లుగా నోచుకోని చిన్నపత్రికల అప్ గ్రేడ్ ప్రక్రియ, యాడ్ లు తదితర సమస్యలు పెనవేసుకొని తచ్చాడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇదిగో అదిగో అంటూ తమరు అక్కడక్కడ పలుచోట్ల ప్రస్తావిస్తున్నప్పటికి ఇంకనూ కార్యరూపం దాల్చలేదని, చాలీ చాలని… అరకొర వేతనాలతో బతుకు బండి లాగిస్తున్న జర్నలిస్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే జర్నలిస్ట్ హెల్త్ స్కీం పేరిట ఆసుపత్రిలో చేర్చుకొని దుర్బర స్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి జీవనం సాగిస్తున్న
తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితిపై పెద్ద మనసుతో కాసింత దృష్టి సారించి ఆసరాగా నిలువాలని ఆకాంక్షించారు.
ప్రధానంగా కొన్ని అంశాలను తమరి దృష్టికి తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు.
1.రైతు బంధు, దళిత బంధు తరహాలో కులాలు, మతాల తారతమ్యం లేకుండా జర్నలిస్టులందరికి జర్నలిస్ట్ బంధును పెట్టి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి.
2. దళితుల ఆర్ధిక పరిపుష్టికి ప్రవేశ పెట్టిన దళిత బంధులో దళిత జర్నలిస్టులకు ప్రాధాన్యతనివ్వాలి.
3. చిన్న పత్రికల మనుగడకు ప్రతిబంధకంగా పరిణమించిన 239 జీఓను సవరించి, వాటికి జీవం పోయాలి. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల అప్ గ్రేడ్ ప్రక్రియను వెంటనే చేపట్టి, ఆయా పత్రికల మనుగడకు యాడ్ లు ఇచ్చి ఆర్థిక చేయూత నివ్వాలి.
4. హైదరాబాద్ లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చిన్న, పెద్ద పత్రికల వ్యత్యాసం లేకుండా జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలతో పాటు సొసైటీల్లో లేని జర్నలిస్టులకు సైతం సకల సదుపాయాలతో హైదరాబాద్ లోనూ, ఇతర జిల్లాలు, నియోజక వర్గం, పట్టణాల్లోనూ ఇళ్ళ స్థలాలు కేటాయించి… ఇళ్లు కట్టించి మెగా జర్నలిస్ట్ కాలనీలుగా తీర్చిదిద్దాలి.
5. సుదీర్ఘ కాలం సమాజ హితం కోసం విశిష్ఠ సేవలందించి రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు కాసింత ఆసరాగా…ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్ ను తెలంగాణలోనూ ప్రవేశ పెట్టాలి.
6. సమాచార శాఖ మంత్రిత్వ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి…
తమరి వద్దే ఉండడంతో జర్నలిస్టుల సమస్యలను ఆయా జర్నలిస్ట్ సంఘాలు తమరి వద్ద ప్రస్తావించడం కష్టతరంగా పరిణమించింది. సమాచార శాఖ మంత్రిగా వేరే వారికి కేటాయించి… ఆయా సమస్యల సాధనకు ప్రతి ఆర్నెళ్లకు ఒక్కసారి సీఎం కేసిఆర్ తమరి సమక్షంలో సమీక్షించాలి. అదేవిధంగా పూర్తి స్థాయి కమీషనర్ ని కూడా కేటాయించాలి. గత ప్రభుత్వాల్లోనూ ప్రత్యేక మంత్రి కొనసాగారు.ఇంకనూ చాలా సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని అంశాలను తమరి దృష్టికి తీసుకువచ్చామన్నారు. సహృదయులైన తమరు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించి జర్నలిస్టులకు ఆసరాగా నిలుస్తారని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.