హస్తినలో గులాబీ జెండా రెపరెపలు….
★ బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన
గులాభీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
★ మాజీ సీఎం లు అఖిలేష్ యాదవ్ ,
కుమార స్వామి , విసికె పార్టీ అధ్యక్షుడు,
ఎంపి తిరుమావళవన్ , వివిధ రాష్ట్రాల
నుండి రైతు సంఘాల నాయకులు హాజరు
★ గులాబీ మయంగా ఢిల్లీ
బిఆర్ ఎస్ ఆఫీస్ ప్రాంగణం
న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :
దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత , కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్ పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాజశ్యామల యాగం పూర్ణాహుతికి
హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్,
మాజీ సీఎం లు అఖిలేష్ యాదవ్, కుమార స్వామి
————————————–
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో ఉదయం రాజశ్యామల యాగం ఋత్విక్కుల వేద మంత్రాల మధ్య ఘనంగా జరిగింది. రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
యాగం ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంటల మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు.
బిఆర్ఎస్ గులాబీ మయంగా ఢిల్లీ ఆఫీస్ ప్రాంగణం….
ఢిల్లీలో నూతనంగా ప్రారంభమైన బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రాంతం బిఆర్ ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా తరలి వచ్చిన గులాబీ నాయకులు, పార్టీ శ్రేణులలతో సందడి నెలకొన్నది. జై బిఆర్ ఎస్, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.