కైకాల పార్థివ దేహానికి నివాళులర్పించిన
ముఖ్యమంత్రి కేసీఆర్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ
కైకాలను వంటి మంచి నటుడ్ని
కోల్పోవడం బాధాకరం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి:
ప్రముఖ సినీనటుడు , మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. శుక్రవారం బంజారా హిల్స్ లోని కైకాల నివాసానికి వెల్లిన సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా ఎంపీగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…
‘‘ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తి. వారు మరణించడం చాలా బాధాకరం. హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నాం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాలను కోల్పోవడం బాధాకరం..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శ సందర్భంగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెంట, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్ తో పాటు వేణు గోపాలచారి, దాసోజు శ్రవణ్, ఆంజనేయులు గౌడ్, పతాని రామకృష్ణ గౌడ్ తదితరులున్నారు.