ప్రతి గడప దరికి సంక్షేమ పథకాలు
గట్టుప్పల్ లో చేనేత క్లస్టర్ లు ప్రారంభం ,సి.సి.రోడ్లు,డ్రైన్ లకు శంకుస్థాపన
రాష్ట్ర పురపాలన,పట్టణ అభివృద్ది,పరిశ్రమలు,చేనేత,
జౌళి శాఖ మంత్రి
కె.తారక రామారావు
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
ప్రతి పేద వాని గడప గడపకు దరిచేరేలా సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళిక బద్దంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ది,పరిశ్రమలు,చేనేత శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం మునుగోడ్ నియోజక వర్గంలో గట్టుప్పల్ మండలంలో 2 కోట్ల రూ.లతో నిర్మించనున్న సి.సి.రోడ్లు,డ్రైన్ లకు మంత్రి శంఖు స్థాపన చేశారు. అదే విధంగా 8 కోట్ల 91 లక్షల 75 వేల రూ.లతో గట్టుప్పల్, తేరట్ పల్లి చేనేత సమూహాలకు భూమి పూజ,నేతన్నకు సహాయం చేసే సంక్షేమ పథకాలు అంద చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేతన్నకు ఇచ్చిన మాట ప్రకారం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు శంఖు స్థాపన చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చేనేత క్లస్టర్ ల వలన గట్టుప్పల్ లో 460 మంది , తేరట్ పల్లి లో 190 మంది లబ్ది దారులకు మేలు కలుగుతుందని అన్నారు.చేనేత శాఖ ద్వారా ఆసు యంత్రాలు,నేతన్న కు ప్రయోజనం చేకూరేలా నేతన్న భీమా,పొదుపు కార్యక్రమాలు కింద సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఇతర మునుగోడ్ ఉప ఎన్నిక సందర్భంగా గట్టుప్పల్ మండల ఇంఛార్జి గా పని చేసినట్లు,గతం లో మాట ఇచ్చిన ప్రకారం గట్టుప్పల్ మండల కేంద్రం అయినట్లు,మండలంను అన్ని హంగులతో తీర్చి దిద్దనున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం నవంబర్ 6 న మునుగోడ్ నియోజక వర్గ శాసన సభ్యులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించారని,గెలిపించిన తర్వాత రెండు సార్లు నియోజకవర్గం లో పర్యటించి నట్లు తెలిపారు. మళ్లీ ఫిబ్రవరిలో వస్తానని తెలిపారు. గతంలో పని చేసిన శాసన సభ్యులు 4 సంవత్సరాలు నియోజక వర్గ అభివృద్దిని పట్టించు కోలేదని,ప్రస్తుత శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది పరుగులు పెడుతున్నట్లూ తెలిపారు. మాటల రూపంలో కాకుండా చేతల ద్వారా ప్రజల మనస్సు గెలుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీష్ రెడ్డి,రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు, జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి.లు ఎల్. రమణ, ఎంసి కోటిరెడ్డి, శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్,రవీంద్ర నాయక్,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఆర్ డిఓ జయచంద్రరెడ్డి, స్థానిక ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు. ముందుగా చండూరులో హెలిపాడ్ కు చేరుకున్న మంత్రి కె.టి.అర్ కు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పుష్ప గుచ్ఛంతో స్వాగతం పలికారు.హెలిపాడ్ నుండి నేరుగా గట్టుప్పల్ మండల కేంద్రంకు చేరుకున్నారు.