
కమలం ఉచ్చులో పడొద్దు
దేశానికి వేగుచుక్క…తెలంగాణ
యువతకు కేటిఆర్ హితవు
హుజూర్ నగర్, అక్షిత ప్రతినిధి :
కమలం ఉచ్చులో యువత పడొద్దని, అత్యంత
ప్రమాదకరమైన పార్టీ భారతీయ జనతా పార్టీనని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పనినని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేవన్ని అబద్ధాలు.. నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పడని మండిపడ్డారు. బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి. ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారు. మోదీ వల్ల దేశం అప్పుల పాలైంది.. దేశం అభాసుపాలైందన్నారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఇవాళ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి. భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయతీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయకులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీ వల్ల ఒక దళితుడు గాని, ఒక గిరిజన వ్యక్తి గాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్పష్టం చేశారు.