

అభివృద్ధి, ప్రజాసంక్షేమమే
బీఆర్ఎస్ ‘తారక’ మంత్రం
* ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం
* అందరి భాగస్వామ్యంతోనే మిర్యాలగూడ నియోజకవర్గాభివృద్ధి
* దామరచర్ల మండలంలో రూ.60 లక్షల నిధులతో మూడు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
* 12గ్రామాలకు రూ.2కోట్ల 60లక్షల ఎస్డీఎఫ్ గ్రాంట్స్ తో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అభివృద్ధి, ప్రజాసంక్షేమమే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సర్కారు ‘తారక’మంత్రం అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు. మిర్యాలగూడ నియోజకవర్గ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టేకుంటా గ్రామాలలో రూ.60 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం పనులతో పాటుగా ఎస్డీఎఫ్ గ్రాంట్స్ ద్వారా మంజూరైన రూ.2కోట్ల 60లక్షల నిధులతో కొత్తపేట, గోన్యా తండా, కేజేఆర్ తండా, కేతావాత్ తండా, దిలావర్ పూర్, బాలాజీ నగర్, కేశవపురం, మాన్ తండా,నునావత్ తండా, లావూరీ భీక్యా తండా, తెట్టేకుంట, జైత్రమ్ తండా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి లో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రగతి-పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా లాంటి కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. కేవలం రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు భాస్కర్ రావు తెలిపారు.