కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్న వనమా * జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్న వనమా
* జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి: కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్దికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదని స్థానిక ఎమ్మెల్యే వనమా కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి కామేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణ సుందరికరణ నియోజకవర్గం వెలిగిపోతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారని నిలదీశారు. పురపాలక వార్డుల్లో కనీస సమస్యలు పరిష్కారం కాలేదని డ్రైనేజీలు అంతర్గత రోడ్లు వీధి లైట్లు ఎప్పటిలాగే శిథిలావస్థలోనే ఉన్నాయని మండిపడ్డారు. కిన్నెరసాని మంచినీరు నెలలో పది రోజులు కూడా రావడం లేదని ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళి 130 కోట్లు విడుదల కానున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికి రూపాయి కూడా రాలేదని విమర్శించారు. మేదరబస్తీ రైల్వే నిర్వాసితులకు రెండు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని ఆరోపించారు.
అదేవిధంగా ఈనెల 3వ తేదీన రైతు బజార్ షాపులు కూల్చివేస్తే నిరసన పేరుతో హంగామా సృష్టించి ఆ తర్వాత తూతూమంత్రంగా నూతనంగా మరో కాంప్లెక్స్ నిర్మిస్తామని కొబ్బరికాయ కొట్టి నానా హడావుడి చేసి ఆ ప్రాంత వ్యాపారస్థులను మభ్య పెట్టారని పేర్కొన్నారు. 5వ తేదీన శంకుస్థాపన ఉంటుందని ప్రకటించి నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. తాజాగా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని అభివృద్ధి అంటూ పత్రిక ప్రకటనలు గుప్పించి మరోసారి ప్రజలను మోసం చేసే కుట్రలకు తెర లెపారని వివరించారు. కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు దండుకుంటు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయడం లేదని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఇప్పటికైనా ఆయా మున్సిపల్ వార్డుల్లో పేరుకుపోయిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా టెండర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాగుల రవికుమార్, చెనిగారపు నిరంజన్ కుమార్, అల్లకొండ శరత్, ధనుంజయ్, ఆకుతోట పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.