సామాజిక రుగ్మతలకు చదువుతోనే పుల్ స్టాప్ కంచర్ల భూపాల్ రెడ్డి

సామాజిక రుగ్మతలకు చదువుతోనే పుల్ స్టాప్

కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

కుల, వర్గ, వర్ణ వివక్షలతో కూడిన నాటి సమాజంలో రుగ్మతలను దూరం చేసేందుకు చదువు ఒక్కటే సరైన మార్గం అని గుర్తించి ఆ దిశగా అకుంఠిత దీక్షతో కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.

మంగళవారం నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు పూలే అని అన్నారు. దేశ పౌరుల భవిష్యత్తుకై జీవిత కాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందని ఆయన అన్నారు. ప్రతి కులంలో ఉన్నోళ్లు లేనోళ్లు అనే తారతమ్య బేధాలు ఉన్నాయని వాటిని రూపు మాపడానికి కుల సంఘాల ప్రతినిధులు చొరవ తీసుకొని రూపుమాపాలని, మనమంతా ఒక్కటే అనే భావన ప్రజలలో కలిగించాలని ఆయన కోరారు. నేటి సమాజంలో విద్యార్థినీ విద్యార్థులు మంచి పనులు చేసి పది మంది మెప్పు పొందాలని, చెడుదారులకు వెళ్లకుండా స్వస్తి పలకాలని ఆయన కోరారు. అదేవిధంగా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, వారు చూపిన మార్గంలోనే నడవాలని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. పూలే విద్యతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తామని గ్రహించి విద్య యొక్క ప్రాముఖ్యత చాటి చెప్పిన మహా వ్యక్తి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ విద్యానందించాలనే సంకల్పంతో కార్పొరేట్ పాఠశాలల తరహాలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. గురుకులాలకు జ్యోతిబాపూలే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు.


ఒక్కో విద్యార్థి పై ఏటా రూ. 1,25,000
లను ప్రభుత్వం ఖర్చు చేస్తూ మొత్తం 6 లక్షల మందికి కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా బోధనను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూలేను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకెళ్లాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాల కు ఒక ఎకరం స్థలం కేటాయింపు ఇప్పటికే జరిగినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నట్లు, అదే విధంగా మీరు కోరిన వెంటనే నా సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవo దక్కాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాలు చేశారని, వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ టి వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ, మహనీయుల జయంతి ఉత్సవాలలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో భాగస్వాములను చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులను, నాయకులను ఆయన కోరారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో,డివిజన్ కేంద్రాలలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘాలకు కేటాయించిన స్థలాన్ని వెంటనే అప్పగించడానికి సంక్షేమ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో హాస్టల్స్ కు స్థలాల సమస్య ఉందన్నారు. దానిపై కూడా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

జిల్లా ఎస్.పి.అపూర్వ రావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,మున్సిపల్
వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,రిటైర్డ్ ఐ. ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్
బి.సి.,ఎస్.సి. సంఘాల నాయకులు చక్ర హరి రామరాజు, బొర్రా సుధాకర్, నేతి రఘుపతి, కత్తుల జగన్, వైద్యుల సత్యనారాయణ, పంకజ్ యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ,, కంది సూర్యనారాయణ, కొండూరు సత్యనారాయణ, గండిచేరువు వెంకన్న, పాలడుగు నాగార్జున, సోమ మల్లయ్య, శ్రీమతి పాలడుగు ప్రభావతి, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తొలుత మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని గడియారం సెంటర్లో గల జ్యోతి రావు పూలే విగ్రహానికి నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్.పి. అపూర్వ రావు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking