విద్యార్థుల కొరకు సమ్మర్ క్రీడా కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి * జిల్లా కలెక్టర్ అనుదీప్

విద్యార్థుల కొరకు సమ్మర్ క్రీడా కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి

* జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

విద్యార్థుల కొరకు సమ్మర్ క్రీడా కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్
కమిషనర్లును ఆదేశించారు. బుధవారం ఐడిఓసి మిని కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్
ఛైర్మన్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిఈలు, ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుండి 10 తరగతి విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 20వ తేదీ నుండి క్రీడా సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. ఉదయం 6 నుండి 8 వరకు సాయంత్రం 4 నుండి 6 వరకు కోచింగ్ నిర్వహించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆటల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రావీణ్యం ఉన్న కోచ్లను ఎంపిక చేయాలని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో టెన్నిస్, షటిల్, అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని చెప్పారు. కొత్తగూడెం పట్టణం రామవరం యార్డులోని డంపింగ్ యార్డులోని వ్యర్థాలు బయో రెమిడేషన్ చేయుటకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల వ్యర్ధాలు నిర్వహణ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని చెప్పారు. బస్తీదవాఖాలు నిర్వహణ గురించి జిల్లా వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. బస్తీ దవాఖానాల్లో సేవలను పెంచాలని, సిబ్బంది సమయ పాలన పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలో డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేయుటకు సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న భవనాన్ని కేటాయించాలని, డ్రగ్ స్టోర్ ఏర్పాటు అత్యంత ప్రధానమని మున్సిపల్ కమిషనర్కు సూచించారు.

తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. క్రీడా ప్రాంగణాలు ఆటలకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పెండింగ్ ఉన్న క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాల్టీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వచ్చిన ప్రతిపాదనలకు పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేయాలని సిపిఓకు సూచించారు. ప్రజల సౌకర్యార్ధం మున్సిపాల్టీలలో నిర్దేశించిన ప్రాంతాలలో బస్ షెల్టర్లు నిర్మించాలని చెప్పారు. వాగుల్లో వ్యర్థాలు వేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని వ్యర్థాలు వేసే ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా అడ్డుగా రక్షణ గోడను నిర్మించాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన వైకుంఠ దామాలు ప్రారంభోత్సవాలు చేపించాలని చెప్పారు. వైకుంఠ దామాల్లో కుర్చీలు, టేబుళ్లు, ర్యాకులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వైకుంఠ దామాలలో మొక్కలు, గ్రీనరీ పెంపుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. మున్సిపాల్టీ వార్డుల్లో వర్షపు నీరు, మురుగునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. మురుగునీరు నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని చెప్పారు. మున్సిపాల్టీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేటాయించిన నిధులతో ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ కమిషనర్లు కాపు సీతాలక్ష్మి, డి. వెంకటేశ్వరావు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, ప్రజారోగ్య శాఖ ఈఈ రంజిత్, మున్సిపల్ కమిషనర్లు రఘు, అంకుష్వలి, శ్రీకాంత్, ఉమామహేశ్వరావు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking