అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, జయంతి ఉత్సవ కమిటి అధ్వర్యంలో కార్యక్రమానికి భారి సంఖ్యలో ప్రజలు హాజరయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు విగ్రహావిష్కరణ వేడుకలను భారి ఎత్తున నిర్వహించనుండగా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ఉత్సవ కమిటి సభ్యులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కమిటి అధ్యక్షులు దుర్గం శేఖర్ ఆయనకు వివరించగా… ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అనంతరం కమిటి సభ్యులను శాలువా, పూలమాలలతో మున్సిపల్ చైర్మన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ… పట్టణంలో నూతనంగా సుందరీకరించిన అంబేద్కర్ కూడలిలో విగ్రహఆవిష్కరణ వేడుకలను ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ పదమూడవ తేది సాయంత్రం అయిదు గంటలకు స్థానిక బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ భారి ఎత్తున ర్యాలి ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లోనూ ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో కమిటి గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, బాబాసాహెబ్ కంబ్లె, కోకన్వీనర్లు శాలిక్ రావు, రత్నజాడే ప్రజ్ఞకుమార్, శైలేందర్ వాగ్మారే, రామ్ చందర్ మహాత్మే, నాయకులూ మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.