ఆదివాసి భూములలో చేస్తున్న కుంట నిర్మాణ పనులను నిలిపివేయాలి

ఆదివాసి భూములలో చేస్తున్న కుంట నిర్మాణ పనులను నిలిపివేయాలి

మంచిర్యాల, అక్షిత బ్యూరో:

మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి పేదల భూముల్లో బలవంతంగా, ఎలాంటి అనుమతి లేకుండా ఉపాధి హామీ పథకం పేరుతో నిర్మిస్తున్న కుంట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం వారు సదరు గ్రామానికి సందర్శించి, కుంట నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామానికి చెందిన గంగాధర్ కు అటవీ హక్కు చట్టం 2006ప్రకారం 9రకాల భూమికి హక్కు పత్రం 2008 సంవత్సరంలో పొందగా, గంగాధర్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన సంతానం అయినా ఇరువురు ఆడపిల్లలు ఏమి చేయలేక, గత 5,6 సంవత్సరాలుగా భూమి బీడుగా ఉంది.

ఇట్టి భూమిని తండ్రి లేని ఆదివాసి ఆడపిల్లల నుండి కాజేయాలని, పెద్ద దిక్కు లేని ఆదివాసీ ఆడపిల్లలనే కనికరం లేకుండా, అటవీశాఖ అధికారులు మోసపూరితంగా, హక్కుపత్రాలు ఉన్న, ఆదివాసి ఆడపిల్లల భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, ఉపాధి హామీ పథకం ద్వారా కుంట నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అనాధలుగా ఉన్న ఆడపిల్లల భూములను వారికి లేకుండా చేయడం కొరకు కొంతమంది పెత్తందారులు కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే గ్రామంలో ఆదివాసుల భూములను కొంతమంది కాజేయ్యడం జరిగిందని ఆరోపించారు. బాధితులు తమ భూములలో నిర్మాణం చేస్తున్న కుంట నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులకు వినవించుకున్న, కుంటి సాకులు చెబుతూ ఆదివాసులకు భూములు లేకుండా చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి, కుంట నిర్మాణ పనులను నిలిపివేసి, ఆదివాసి భూములకు రక్షణ కల్పిస్తూ ఆదివాసి ఆడపిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking