ప్రతి గ్రామంలో ఉపాధి  పనులు కల్పించాలి డిఆర్ డిఓ కాళిందిని

ప్రతి గ్రామంలో ఉపాధి 

పనులు కల్పించాలి

డిఆర్ డిఓ కాళిందిని

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

మహాత్మాగాంధీ జాతీయ

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని ఎం.పి.డి.ఓ.లను, ఎం.పి.ఓ లను డి.ఆర్.డి.ఓ కాళిందిని ఆదేశించారు.

 

గురువారం కలెక్టరేట్ నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి.ఓ.లు, ఏ.పి.ఓ లతో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాత్మా జాతీయ  గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబిలైజేషన్, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, గ్రామపంచాయతీలోని సేగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, నీళ్ల ట్యాంకులు, మొక్కల సంరక్షణ, తదితర అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతము పనుల సీజన్ అయినందున షెడ్యూల్ ప్రకారం ఉపాధి పనులు కచ్చితంగా జరగాలని ఆమె తెలిపారు. చేసిన పనులకు మెజర్మెంట్ చేయాలన్నారు. అదేవిధంగా పనులకు సంబంధించిన సమగ్ర వివరాలు కంప్యూటర్ ఆపరేటర్ చేత నమోదు చేయించాలని ఆమె కోరారు. గ్రామానికి సంబంధించిన పనుల వివరాలతో కూడిన ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. క్రీడా ప్రాంగణాలలో వడ్ల కుప్పలు పోయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావస్తున్నందున పిల్లలు ఆడుకోవడానికి అనుగుణంగా క్రీడా ప్రాంగణాలు ఉండాలని ఆమె సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలలో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణపై రాష్ట్ర స్థాయి బృందాలు పర్యటించి పరిశీలిస్తారని ఆమె తెలిపారు.

 

జిల్లా పరిషత్ సి.ఈ.ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ  ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంపిక చేసిన వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎంపిక చేసిన వారిని గ్రామం నుండి మండల కేంద్రానికి తరలించి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లకు తగు సమాచారం అందించాలని ఎం.పి.డి. ఓ లను కోరారు. లైజన్ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బందికి బస్సుల వారిగా అప్పగించి అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. ఎంపిక చేసిన స్థలాలలో మంచినీరు, భోజన సదుపాయాలు కల్పించినట్లు ఆయన వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking