సిపిఆర్ తో ప్రాణ రక్షణ
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిసోసి యేషన్) చేసినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చునని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా తరువాతనే ఈ కార్డియాక్ అరెస్టులు ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. ఆహారపు అలవాట్లు మారి నేటి సమాజంలో ఎక్కువగా షుగర్, బీపీలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డాక్టర్లను సంప్రదించి వారు సూచించిన ప్రకారము వ్యాయామం, నడకను విధిగా పాటించాలన్నారు. అదేవిధంగా డాక్టర్లు ఇచ్చే మందులను వాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్యవంతంగా జీవించాలని ఆయన కోరారు. కొంతమంది మాకెందుకులే అని నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అలా కాకుండా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా బ్రతకాలని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో గుండెపోట్లు పెరిగినందున ఆరోగ్యశాఖ నివేదిక అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక గుండెపోటులను తగ్గించడానికి సిపిఆర్ శిక్షణ ఇచ్చి ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సి పి ఆర్ శిక్షణకు డాక్టర్లు, అధికారులు, పోలీసులకే, కాకుండా ఆర్.ఎం.పి డాక్టర్లకు, యువజన సంఘాల సభ్యులకు కూడా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక వ్యక్తికి ఆకస్మిక గుండెపోటు సంభవించినప్పుడు ప్రాథమిక చికిత్స లేదా అంబులెన్స్ వచ్చేలోపు సిపిఆర్ చేస్తూ ఆక్సిజన్ అందిస్తే ఒక ప్రాణాన్ని, అదేవిధంగా ఒక కుటుంబాన్ని కాపాడిన వారము అవుతామని ఆయన అన్నారు. అందుకే ప్రభుత్వము ప్రతి ఒక్కరికీ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ,డి.అర్.డి. ఓ., మెప్మా, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,పోలీస్,రవాణా, విద్యా శాఖలకు చెందిన కొంతమందికి శిక్షణను ఇచ్చి, వారి చేత మరికొంత మందికి శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
శిక్షణా కార్యక్రమంలో సిపిఆర్ ఫై డి.ఐ.ఓ జమిలుద్దీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, శాఖల వారీగా బృందాలకు సిపిఆర్ చేసే విధానాన్ని డెమో ద్వారా చేసి అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్ కొండల్ రావు,జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.