శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి

లేబర్ కోడ్లు రద్దు చేయాలి

ఎఐటియుసి కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

కేంద్ర పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు ఆవలంబించడం వల్ల మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంపులో జరిగిన ఏఐటియుసి మిర్యాలగూడ నియోజకవర్గ 11వ మహాసభలో ఆయన మాట్లాడుతూ పాలక వర్గాలు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారాయని అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు కనుమరుగై మోడీ సర్కార్ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. 44 కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకు రావడం కార్మికులకు శాపంగా మారాయని అన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని
శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు. గతంలో కార్మిక చట్టాలు అత్యంత పదునుగా ఉండడంతో శ్రమకు తగిన రీతిలో కాకపోయినా కనీసం సగమైనా వేతనం లభించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు. పాలకులు ఆవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధాం కావాలన్నారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మికులు మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు,
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్.రామస్వామి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం వలన పేద మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారన్నారు. జులై 19న నల్లగొండ జిల్లా ఏఐటీయూసీ మహాసభ గుర్రంపొడ్ లో జరుగుతుందన్నారు.
మహాసభకు బంటు రాజేశ్వరి అధ్యక్షత వహించగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తన్నీరు పాండు రంగారావు ఏఐటీయూసీ డివిజన్ నాయకులు జిల్లా యదగిరి , బి బాలకృష్ణ, గోగుల యాదగిరి, కే బిక్షం, గోపనాయక్, ఏం రాము, షమీమ్, పుల్లారావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking