విమర్శిస్తే మీడియాపై ఉక్కు పాదమా? సహజ న్యాయ సూత్రాలను నిరాకరించడానికి వీలు లేదన్న సుప్రీంకోర్టు. “మీడియా వన్” ఛానల్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని కొట్టివేసిన భారత సర్వోన్నత న్యాయస్థానం

విమర్శిస్తే మీడియాపై ఉక్కు పాదమా?

సహజ న్యాయ సూత్రాలను నిరాకరించడానికి వీలు లేదన్న సుప్రీంకోర్టు.

“మీడియా వన్” ఛానల్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని కొట్టివేసిన భారత సర్వోన్నత న్యాయస్థానం

స్వాతంత్రం సాధించిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని,రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించడం ద్వారా సామ్యవాద స్థాపన జరగాలని ఎందరో తమ ధనమానప్రాణాలను అర్పించి ఏడు దశాబ్దాలకు పైగా జరుగుతున్న ఎన్నికలలో ఓట్ల రాజకీయం రోజురోజుకు డబ్బుతో కూడుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను బానిసలుగా చూసే దుస్ట సంప్రదాయానికి పాల్పడుతూ నియంతృత్వం ,నిరంకుశత్వం,అణచివేత ,ఆధిపత్యాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రతిపక్షాల పైన కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే.ఇదే సందర్భంలో అత్యంత బాధాకరమైన విషయం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సర్వే ప్రకారం భారతదేశం కొన్ని రంగాలలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటే మన పాలకుల యొక్క నిర్లక్ష్యం , సాచివేత వైఖరి ,పెట్టుబడిదారులకు వంతపడే ధోరణితో పాటు , ప్రశ్నించిన వాళ్లపైన అణచివేతకు పాల్పడటాన్ని ఇటీ వలికాలంలో ప్రభలంగా గుర్తించవచ్చు.అవినీతిలో 120వ స్థానం ,ఆకలిలో 110వ స్థానం, ప్రజాస్వామ్యం అమలు విషయంలో 97వ స్థానం,ఆనందంలో 125వ స్థానం కలిగి ఉంటే పత్రికా స్వేచ్ఛకు సంబంధించి మీడియా స్వాతంత్రానికి సంబంధించి ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అణచివేస్తున్నాయో తెలుసుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ లో భారతదేశానికి ఉన్న 150 వ స్థానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.అంటే అత్యంత హీనమైన స్థితిలో పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే రుజువు అవసరం లేదు కదా?

మలయాళీ న్యూస్ ఛానల్ మీడియా వన్ పై కేంద్ర నిషేధం సుప్రీంకోర్టు స్పందన

 

కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీ న్యూస్ ఛానల్ మీడియా వన్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కథనాలు ప్రసారం చేసింది .ఈ క్రమంలో ప్రభుత్వం అనుమతించిన చానల్ల జాబితా నుంచి మీడియా వన్ పేరును కేంద్ర ప్రసార శాఖ తొలగించింది. 2022 జనవరి 31 వ తేదీ నుంచి ఆ ఛానల్ ప్రసారాలను కేంద్రం పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తుంది . కేంద్ర నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడ సమర్ధి0చినప్పటికీ దీనిపై చానల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిషేధ ఉత్తర్వులపై అదే ఏడాది మార్చిలో స్టే విధించింది . తిరిగి ఏప్రిల్ 5 బుధవారం 2023 రోజున సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సందర్భ0గా సిజేఐడీవై చంద్ర చూడు ఆధ్వర్యంలోని ధర్మాసనం మీడియా స్వేచ్ఛ పైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం , ప్రభుత్వాలను విమర్శిస్తే మీడియా పైన ఉక్కు పాదం మోపడం ఏ రకంగా సమంజసమని ప్రశ్నించడం,అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పత్రికా స్వేచ్ఛ కల భారతదేశంలో కారు చీకటిలో కాంతిరేఖ లాగా సుప్రీంకోర్టు కేంద్ర విధించిన నిషేధాన్ని కొట్టివేయడం ప్రజలు ప్రజాస్వామికవాదులు పత్రికారంగా విజయంగా భావించవచ్చు.ఊహాజనిత కారణాలతో సదర్ న్యూస్ ఛానల్ లైసెన్సును కేంద్ర హోంశాఖ పునరుద్ధరించకపోవడాన్ని కోర్టు తప్పు పట్టుతూ హోంశాఖ పనితీరు అసాధారణంగా అణచివేత ధోరణితో ఉన్నదని కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.పౌరుల ప్రాథమిక హక్కులను జాతీయ భద్రత పేరిట పూర్తిగా త్రుణీకరించడం సరైన విధానం కాదని అటువంటి ప్రయత్నాన్ని కేంద్ర హోంశాఖ చేయడం దాని ఆధిపత్య ధోరణికి నిదర్శనమని సుప్రీంకోర్టు చేసిన విమర్శలు ఇప్పటికైనా చానెల్లను నిషేధిస్తామని ప్రకటించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అహంకారానికి అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నవి.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిజెఐ డివై చంద్ర చూడు వ్యాఖ్యానిస్తూ గొప్ప ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ కీలకమని చేసిన సూచన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణికి ఇకనుండి అయినా అడ్డుకట్ట వేస్తుందని మీడియా పత్రికా రంగాలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించి తన బాధ్యతను నిబద్ధతగా నిర్వహిస్తుందని ఆశిద్దాం. . మీడియా నిషేధానికి సంబంధించి కేంద్రం తగిన ఆధారాలను చూపలేకపోయిందని ఈ ఛానల్ కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయన్నడానికి ఆధార లేవి కూడా సమర్పించలేక పోయిందని సుప్రీంకోర్టు తప్పు పట్టింది . సీ ల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేసినటువంటి ఆధారాలను తీవ్రంగా ప్రతిఘటించిన సుప్రీంకోర్టు బహిరంగ విచారణ జరుగుతున్నప్పుడు ఏ ఆధారము సమాచారమైన అన్ని పక్షాలకు అందవలసినదే కానీ దర్యాప్తు పత్రాలను రహస్యంగా ఉంచడం వీలుకాదు .పైగా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను బహిర్గతం చేయవలసిందిగా కేంద్రానికి చేసిన సూచన కేంద్రాన్ని ఇరుకున పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఇదే అంశం పైన భద్రతా కారణాలతో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా నిరాకరించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఏ కారణంతో నైనా దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలను పూర్తిగా దాచి ఉంచడం వాంఛనీయం కాదని న్యాయ వ్యవహారాలలో పారదర్శకతను పాటించాలని కేంద్రం సీల్డ్ కవర్లో అందజేసినటువంటి ఆధారాలపైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పును వెలువరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిందనే కారణంగా మలయాళీ న్యూస్ ఛానల్ మీడియా వన్ పై కేంద్ర విధించిన నిషేధాన్ని కోర్టు కొట్టి వేసి తన చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించి0ది.

ప్రసార మాధ్యమాలను ప్రజలే కాపాడుకోవాలి

 

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తుల అక్రమార్జన,భూదందాలు, అవినీతి బాగోతాల పైన స్పందించి కథనాలు వెలువరించినందుకు, ఘాటుగా ప్రతిఘటించినందుకు అనేకమంది మీడియా ప్రతినిధుల పైన దాడులు హత్యలు సర్వసాధారణమైపోతున్న ఈ దశలో ప్రజల పక్షాన పని చేయవలసిన మీడియా ప్రతినిధులుగా తమకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అందుకు సంబంధించి ఇలాంటి ఘాటైన తీర్పులు, ప్రజల పక్షాన మీడియాను సమర్థిస్తూ మీడియా స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పులు భవిష్యత్తు తరాలకు ఎంతో ఊరట కలిగిస్తుంది. నీతి నిజాయితీగా విలువలకు కట్టుబడి ప్రజల పక్షాన మీడియాలో పనిచేయడానికి సిద్ధపడుతున్నటువంటి ముఖ్యంగా యువ మీడియా మిత్రులు అనేక రకాల బెదిరింపులు ఇతర దాడులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీడియాకు ఉన్న స్వేచ్ఛ అధికారం హక్కుల పైన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ప్రజల విజయంగా భావించవచ్చు. పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ప్రపంచంలోనే 150వ స్థానంలో ఉన్నదంటే ఈ దేశంలో మీడియా ఏ పాటి స్వేచ్ఛను అనుభవిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంత గడ్డు పరిస్థితిని కూడా అవగాహన చేసుకోకుండా మూర్ఖంగా నిరంకుశంగా ఆధిపత్యంగా నియంతృత్వంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికలు మీడియా పైన ఉక్కు పాదం మోపడాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండాలి.ప్రజల కొరకు పని చేసే మీడియా పత్రికలు ఇతర ప్రసార మాధ్యమాలను ప్రజలు ప్రజాస్వామిక వాదులే బ్రతికించుకోవాలి. ఇందుకు మీడియా స్వేచ్ఛగా మరి0త ముందుకు వస్తే తప్పకుండా ప్రజలు బ్రతికించుకోవడానికి చొరవ చూపాలి .పాలకూలపైన తమ నిరసన గలాన్ని వినిపించాలి అందుకు ఇలాంటి న్యాయస్థానాల తీర్పులు కూడా ఎంతో తోడ్పడతాయి .పదిమంది నడిస్తే దారి ఏర్పడినట్లు తప్పును తప్పు అని అనకపోతే నేరాన్ని న్యాయంగా తప్పును ఒప్పుగా రుజువు చేయడానికి మనదేశంలోని ప్రభుత్వాలు వెనుకాడవు అని గ్రహించాలి. వజ్రోత్సవ భారతదేశంలో కూడా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కాలదన్ని అక్రమాలకు అరాచకాలకు కార్పొరేట్ శక్తులకు వంత పాడే ప్రభుత్వాల పరధ్యానాన్ని ప్రజల వైపుగా మరల్చాలంటే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మీడియాను రక్షించుకోవడానికి నిరంతరం చైతన్య కార్యక్రమాలు, నిరసన గళాలు , ప్రతిఘటన ఉద్యమాలు, ప్రశ్నించే గొంతులు ఏకం కావలసిన అవసరం చాలా ఉన్నది. అప్పుడు మాత్రమే అరాచక శక్తుల యొక్క అక్రమ పరిపాలనను అంతం చేయడానికి ఓటర్లు తమ శక్తిని ప్రదర్శించి తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి అనువైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవసరమైతే గద్దె దించడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే స్వాతంత్ర పలాలను పొందగలము .వజ్రోత్సవ భారతికి సార్థకతను తీసుకురాగలము .రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తికి లోటు రాకుండా నిరంతరం ప్రజలు జాగరూకులై ఉండడమే ఇందుకు కొలమానంగా భావించాలి .

Leave A Reply

Your email address will not be published.

Breaking