కేంద్రం పేదలకు వ్యతిరేకం పెద్దలకు సానుకూలంగా పనిచేస్తుంది.
– కమ్యూనిస్టులకు బిజెపి పెద్ద శత్రువు కాంగ్రెస్, బిఆర్ఎస్ చిన్న శత్రువులు.
-వివాదంలో ఉన్న కృష్ణాజలాలను ఉపయోగించడంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు.
-సిపిఐ మునుగోడు నియోజకవర్గ పాదయాత్ర ప్రారంభంలో పల్లా వెంకటరెడ్డి.
అక్షిత ;చౌటుప్పల్/సంస్థాన్ నారాయణపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా,పెద్దలకు సానుకూలంగా పనిచేస్తున్నదని, తమకు బిజెపి పార్టీ పెద్ద శత్రువు అని బిఆర్ఎస్,కాంగ్రెస్ లు చిన్న శత్రువులని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలలో తెలంగాణ వాటా తేల్చాలని, నియోజకవర్గానికి సాగు నీరు అందించే డిండి, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ సిపిఐ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో పాదయాత్రను గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రారంభించారు. ఈ పాదయాత్రను సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకటరెడ్డి, సీనియర్ జర్నలిస్టు కే.శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభ కార్యక్రమంలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ… బిజెపి రాజకీయ వివాదాలను వివరించడానికి,ఆర్థిక, మతోన్మాద విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. సమాజం కోసం పోరాడే వారిని బిజెపి ప్రభుత్వం శత్రువులుగా పరిగణిస్తున్నదని, బిజెపి మతోన్మాద ఏజెండాను ప్రజలంతా అర్థం చేసుకోవాలని సూచించారు. కార్మికులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తుందని అన్నారు. జాతీయ ఉపాధి చట్టంలో కఠిన నిబంధనలు పెడుతూ ఆ చట్టానికి నిధులు కేటాయించకుండా కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నదని విమర్శించారు.మోడీ నల్ల డబ్బు తీసుకువచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అంటూ 1000 రూపాయల నోటును రద్దుచేసి ₹2,000 తీసుకువచ్చారని, ఎన్నికల్లో డబ్బును సులువుగా పంపిణీ చేయవచ్చుననే కుట్రతోనే 2000 నోటు తీసుకువచ్చినట్లు ఆయన ఆరోపించారు.అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి 2000 రూపాయల నోట్లను పంపిణీ చేసిందని అన్నారు. 400 ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు కమ్యూనిస్టులు పోరాడితే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రైవేట్ పరం చేస్తున్నదని అన్నారు. లాభాలలో నడుస్తున్న ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేసి అదానికి కట్టబెట్టడానికి బిజెపి కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. మోడీ అందించిన వనరులతోనే అదానీ ప్రపంచ కుబేరుడు అయ్యాడని విమర్శించారు. తెలంగాణ విభజన చట్ట హామీలను బిజెపి అమలు చేయడం లేదని,గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అన్నారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటాను నిర్ణయించలేదని అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసుకొని రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేస్తున్నదని అన్నారు. డిండి, చెర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వివాదంలో లేని గోదావరి జలాలను ముందుగా వినియోగించి వివాదంలో ఉన్న కృష్ణాజలాలను ఉపయోగించడంలో నిర్లక్ష్యం చేశారని దీనితో కొత్త చిక్కులు ఏర్పడ్డాయని అన్నారు. పెద్ద శత్రువు అయిన బిజెపిని ఓడగొట్టడానికి చిన్న శత్రువులైన బిఆర్ఎస్,కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించేలా బిజెపి పనిచేస్తున్నదని, బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు పనిచేయకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ,టిడిపి,జనసేన ఏ ఒక్కటి కూడా బిజెపిని విమర్శించడం లేదని అన్నారు. మునుగోడు లో 12 వేలకు మించి బిజెపికి ఓట్లు లేవని కానీ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులతో కొన్ని ఓట్లు సంపాదించాడని అన్నారు. మునుగోడులో బిజెపి రెండో స్థానంలో ఉండాలనేదే ఆ పార్టీ లక్ష్యమని,మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవడం బిజెపికి కూడా ఇష్టం లేదని,ఇక్కడ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి బిజెపి ఆయనతో రాజీనామా చేయించిందని అన్నారు. మునుగోడు లో బిజెపి గెలిచి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి తారుమారయ్యేదని ఆ ప్రమాదాన్ని కమ్యూనిస్టులు నిరోధించారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీలు అమలు చేయడానికి కొట్లాడే పార్టీలు కమ్యూనిస్టు పార్టీలేనని, కేంద్రం అభివృద్ధికి ప్రతిబంధకం అయితే కేంద్రంపై చేసే పోరాటంలో తమతో కలిసి రావాలని కేసిఆర్ కు ఆయన హితవు పలికారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో సిపిఐ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు, సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, నాయకులు కే.శ్రీనివాస్, బచ్చనగోని గాలయ్య, ఆర్ అంజచారి, బొలుగురి నర్సింహా, టి. వెంకటేశ్వర్లు,పల్లె శేఖర్ రెడ్డి,దుబ్బాక భాస్కర్, బి. జగన్, కలకొండ సంజీవ, చిలివేరు అంజయ్య, పొట్ట శంకరయ్య, కందుల లింగమ్మ,లు పాల్గొన్నారు.ప్రజానాట్యమండలి కళాకారుల ఆట, పాటలు పలువురిని ఆకట్టు కున్నాయి. ఈ పాదయాత్ర తంగడపల్లి, దామెర, గుడిమల్కాపూర్, మీదుగా కోతులాపురం చేరుకొనుంది.