కార్మికులను ఆర్థికంగా నష్టపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు ఆదాయపన్ను కోతలతో కార్మికులు వేతనాలు నష్టపరుస్తూ, మరోవైపు లేనిపోని డిపిఈ నిబంధనల పేరుతో 11వ వేజ్ బోర్డ్ పరిష్కరించక, కార్మికులను ఆర్థికంగా నష్టపరుస్తూ, అన్యాయం చేస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్ విమర్శించారు. గురువారం ఏరియాలోని కేకే 5 గనిపై గనిఫిట్ కార్యదర్శి సంకె వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ద్వార సమావేశానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేజ్ బోర్డు ఆలస్యం అయ్యే కొద్ది కార్మికులలో అశాంతి రేకెత్తే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, వచ్చే సమావేశంలోనైనా వేజ్ బోర్డును పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐటీ గురించి వివరిస్తూ బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను మినహాయించమని పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం తేల్చి చెప్పిందని, కోలిండియాలో అలవెన్స్ల పై ఆదాయపన్ను మినహాయించాలని చేసిన ఒప్పందాన్ని 2011 నుండి గెలిచిన సంఘాల అసమర్థత వలన రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న సింగరేణిని ఆదేశించకపోవడంతో ఒప్పందం అమలు కావడం లేదన్నారు. దీనిపై సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో సంతకాల సేకరణ చేసి, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన ఫలితం దక్కలేదని తెలిపారు. కార్మిక సంఘాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యంతో కలిసి కార్మికులపై పని ఒత్తిడి పెంచుతుందని, కార్మిక సంఘాల విధానాలు వేరైనా, ఐక్యంగా కార్మికుల కోసం యాజమాన్యం, ప్రభుత్వాలపై పోరాడాలని, ప్రభుత్వ విధానాలు కార్మికులకు తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా మార్చాలని సూచించారు. కార్మిక సంఘాలు గతంలో కార్మికుల ఇచ్చిన మద్దతుతోనే అనేక హక్కులు సాధించాయని, నేడు కొందరు కార్మికులు కార్మిక సంఘాలకు దూరంగా ఉంటున్నారని, ఆ పద్ధతి మంచిది కాదని, కచ్చితంగా తమ కోసం పనిచేసే యూనియన్ లో ఉండి, ఉన్న హక్కులను కాపాడుకోవాలని కోరారు. సిఎస్ఆర్ నిధులతో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న యాజమాన్యం తన సంస్థలో పనిచేసే కార్మికులకు మాత్రం మంచి క్వార్టర్ లను కేటాయించడం లేదని, కార్మిక వాడల్లో త్రాగడానికి నీరు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్వార్టర్ ఉన్నందుకు కార్మికులు ఆదాయ పన్ను ఎక్కువ కడుతున్నారనే విషయాన్ని సిఐటియు కార్మికులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రిటైర్మెంట్ నాటికి ఎవరి క్వార్టర్ వారికే ఇవ్వాలని, లేదా 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ పోరాటాలు చేస్తున్నామని వివరించారు. సింగరేణి ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చే ఎమ్మెల్యేలకు సింగరేణిలో కార్మికుల గురించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బొగ్గు రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు రోజురోజుకు పెరుగుతున్నరని, వారికి సరైన ఉద్యోగ భద్రత లేదని, సమయానికి వేతనాలు సైతం రావడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని ఒప్పందం చేసినప్పటికీ అది సింగరేణిలో అమలు కావడం లేదని, కాంట్రాక్ట్ కార్మికులకు సైతం ఓటు హక్కు కల్పించాలని, అప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఏరియాలో కేబుల్ బాయ్ యాక్టింగ్ ఇవ్వడం లేదని, వారి పరిస్థితి మరి దయనీయంగా ఉందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఎస్డిఎల్ వద్ద పనిచేసే కేబుల్ బాయ్ లకు యాక్టింగ్ ఇచ్చి, పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏరియాలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి, ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు వి ఐలయ్య, నాయకులు సంజీవ్, బేతి భరత్, లింగాల రమేష్, గని ఫిట్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, జోరుక వెంకటేష్, అచ్యుత్ రెడ్డి,దొండ నవీన్, జెల్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.