*సినిమాల్లో దళిత హీరోయిజంపై పరిశోధనకు డాక్టరేట్..
జర్నలిస్ట్ మహేష్ కొంగరకు పీహెచ్ డీ ప్రకటించిన ఓయూ*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్ట్ మహేష్ కొంగరకు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్ డీ లో డాక్టరేట్ ప్రకటించింది. వర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఆయన ఈ పట్టా అందుకున్నారు. దివంగత ప్రొఫెసర్ బీ బాలస్వామి మరణానంతరం డాక్టర్ టీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో *దళిత్ అసర్షన్ అండ్ మీడియా: ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ తెలుగు ఫిల్మ్స్* అనే అంశంపై సిద్ధాంత వ్యాసం (రీసెర్చ్ థిసిస్) సమర్పించారు. ఇందులో భాగంగా బలిపీఠం (1975), స్వయంకృషి (1987), ఒసేయ్ రాములమ్మ (1997), పలాస 1978 (2020), లవ్ స్టోరీ (2021) సినిమాల్లోని ప్రధాన పాత్ర ( లీడ్ రోల్స్)లను తన రీసెర్చ్ కు ఎంచుకున్నట్టు మహేష్ తెలిపారు.

దళిత క్యారెక్టర్లను కమెడియన్లుగా, విలన్లుగా, ఇతర ప్రాధాన్యం లేని పాత్రల్లో చూపించిన సినిమాల కంటే పైన పేర్కొన్న సినిమాల్లో ప్రధాన పాత్ర (లీడ్ రోల్స్) లను దళిత అస్తిత్వం (assertion హీరోయిజం) ఉన్న క్యారెక్టర్లు గా చిత్రీకరించడంలో ముందున్నాయని పేర్కొన్నారు. నిజ జీవితంలో దళితులు కోరుకుంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆత్మ గౌరవాలు ఈ సినిమాల్లో కనిపిస్తాయని అయితే కథా రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు దళితేతరులు కావడంతో దళితుల వాస్తవ జీవితాలకు కాస్త అవతలనే ఉన్నట్టుగానే కనిపిస్తాయని, దళిత జీవితాలను నిండుగా స్ప్రుజించలేదని పేర్కొన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఆశించిన ప్రతిఫలం వీటిల్లో లేదని, దళిత థీమ్ కమర్షియల్ కోణాల్లో చూపించినప్పటికీ అవి గాంధేయ (బలిపీఠం- భర్త చనిపోయిన విధవను పెళ్లి చేసుకునే దళితుడు చివరికి ఆమె కులం పేరుతో దూరం పెట్టేసరికి ఆశ్రమానికి చేరుకుంటాడు) సంఘ సంస్కరణ వాదిగానో… ఆర్థిక స్వావలంబనతోనే కులం సమసి పోతుందని (స్వయం కృషి -చెప్పులు కుట్టే సాంబయ్య సాంబ శివరావుగా మారడం), దళితులు తుపాకులు పడితేనే (ఒసేయ్ రాములమ్మ – నక్సలిజం) సమస్యలు పరిష్కారం అవుతాయనో, ప్రతీకారం, రాజకీయ తిరుగుబాటు ( పలాస 1978) దార్లు గానో , తన కాళ్లపై నిలబడతానని తల్లికి ఇచ్చిన మాట మరిచి ప్రేమించిన అమ్మాయి కోసం హంతకుడిగా మారి జైలు పాలు కావడమో దళితుల ఆశయాలుగా అన్నట్టుగా చిత్రీకరించారని మహేష్ వివరించారు. అయితే ప్రతి పదేళ్లకు ఒక్కటైన దళిత థీమ్ తో దళిత క్యారెక్టర్లు ప్రధాన పాత్రలుగా కమర్షియల్ హిట్ ఫార్ములాతో ఒక్క సినిమా అయినా విడుదల అవుతుందని గుర్తు చేసిన ఆయన…తెలుగు సినిమా ఇండస్ట్రీలో దళితుల ప్రాతినిధ్యం ఇంకా మొదలు కాలేదని చెప్పవచ్చని అన్నారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మహేష్ కొంగర ప్రాథమిక విద్యాభ్యాసం (పదో తరగతి వరకు), ఇంటర్మీడియట్ ఇబ్రహీంపట్నంలో కొనసాగింది. నిజాం కాలేజీ నుంచి బీ ఏ డిగ్రీ, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ , ఎంఫీల్ పట్టా పొందారు.
ప్రస్తుతం జర్నలిస్టుగా , సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పని చేస్తున్నారు. 2017లో కలంసత్రం (మీడియా నవల) పుస్తకం రాశారు.