బీఆర్ఎస్ వెన్నంటే మైనారిటీలు
* అవంతీపురం ఈద్గా అభివృద్ధి కోసం
మరో కోటి రూపాయలు
* షాదీఖానా నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు
* మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వెన్నంటే మైనారిటీలంతా ఉన్నారని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ ఈద్గా, అవంతీపురంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. అవంతీపురం ఈద్గా అభివృద్ధి కోసం గతేడాది మంజూరు చేసిన కోటి రూపాయలకు అనుబంధంగా మరో కోటి రూపాయలను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా, మిర్యాలగూడ నియోజకవర్గంలో నిరుపేద ముస్లిం యువతుల వివాహం కోసం సకల సౌకర్యాలతో కూడిన అధునాతన షాదీఖానా నిర్మాణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు రూ.2 కోట్లు మంజూరు చేయనున్నట్టు భాస్కర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే విస్తరణలో అతిపెద్ద షాదీఖానా నిర్మాణం మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టనున్నట్టు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు.

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ , సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని,తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పర్వదినం ప్రతీక అని భాస్కర్ రావు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని,గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డీఎస్పీ వెంకట గిరి, యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, రూరల్ ఇన్స్ పెక్టర్ సత్యనారాయణ, నాగభూషణం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జునచారి, దయాకర్ రెడ్డి, మగ్దూమ్ పాషా, ఇలియాజ్, తదితరులు పాల్గొన్నారు.