ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

పట్టణం, మండలంలో ఈదుల్‌ ఫితర్‌ (రంజాన్‌) పర్వదినాన్ని ముస్లింలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్, పాతబస్టాండ్ ప్రాంతాలలో కల ఈద్గా ప్రాంగణంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆనందోత్సాహాలతో పండుగను ఘనంగా ఆచరించారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక వస్త్రధారణ, సంప్రదాయ దుస్తులతో ముస్లింలు సందడి చేశారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మహ్మద్‌ ప్రవక్త బోధించిన అంశాలను మత గురువులు ఉపదేశించారు.

అనంతరం వయస్సు, కుల, మత తారతమ్యం లేకుండా ఒక్కరినొక్కరు ఆలింగనం చేసుకుంటూ, పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు, పెద్దలు మాట్లాడుతూ, ముందుగా రంజాన్‌ పండుగ ప్రాముఖ్యతను గురించి వివరించారు. కఠోర ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం వచ్చే రంజాన్‌ వేడుక మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. హిందూ, ముస్లింలు ఐక్యతతో కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకుంటారన్నారు. అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖశాంతులతో కలిసిమెలిసి, ఆనందంగా జీవించేలా చూడాలని భగవంతుని కోరారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల ఈద్గాను మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, సీనియర్ పాత్రికేయుడు ఎండి మునీర్ లు సందర్శించి, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్త్‌ను నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking