మతసామరస్యాన్ని పాటిద్దాం
– ఈధ్ ఉల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు
జవహర్ నగర్, అక్షిత ప్రతినిధి :
క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మానవత్వంతో కూడిన పరమత సహనం, మతసామరస్యాన్ని పాటించాలని మత పెద్ద గురువులైన ఇమామ్లు సామూహిక ప్రార్థనల్లో కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కాప్రా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల అన్ని ఈధ్ గాహ్ లలో శనివారం రోజు రంజాన్ పండుగ సందర్భంగా అల్లా హుత అల్లా మహ్మద్ ప్రవక్త పట్ల భక్తి శ్రద్దలను కనబరుస్తూ ముస్లిం ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు జరిపారు. ఉన్నదాంట్లో తమ ఆదాయం నుండి నిరుపేదలను, అనాదలను ఆదుకోవాలని ఇమామ్లు సూచించారు. ధనిక, పేద అనే తారతమ్యం చూపరాదని, అల్లా ముందు అందరు సమానమే అనే సోదరభావనతో మెలగాలని కోరారు. హిందు, ముస్లిం, క్రిష్టియన్ అనే భేదాలు లేకుండా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు, నేతలు, కార్యకర్తలు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం మైనారిటీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు ఎం.డి.పాషామియా, టి.కాలేశా, గౌస్, వహీద్, మహ్మద్ యూసూఫ్ ఖాద్రీ, సైయద్, జావేద్, ఉమార్ తదితరులు జవహర్ నగరులోని అన్ని వర్గాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.