ఐకెపి వివోఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18వేల ఐకెపి వివోఏ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ నేత రామిల్ల రాధిక డిమాండ్ చేశారు. మండల కార్యాలయం ఎదుట గల ఐకేపీ వివోఏ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి, గత ఎనిమిది రోజులుగా వారు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వెంటనే ఐకేపీ వివోఏ ఉద్యోగులకు కనీస వేతనం 26వేలకు పెంచి, పిఆర్సి అమలు చేయాలని, వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వివోఏ లకు రోజుకు కనీస వేతనం దాదాపు 150రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, 150 రూపాయలతో ఎలా జీవించాలో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కష్టపడి పని చేసి, పాలమ్ముకొని పైకి వచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్న కార్మిక శాఖ మంత్రి 150రూపాలతోనే ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించి, ఇంత స్థాయికి ఎదిగారని ప్రశ్నించారు. చేయకూడని పని చేసి ఈడీ కేసులో ఇరుక్కున్న మహిళా నేతకు మద్దతుగా రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేసి, మహిళా రిజర్వేషన్ల పేరుతో దొంగ పోరాటం జరిపి కేసును తప్పుదోవ పట్టించారని, వారికి వివోఏ మహిళ ఉద్యోగులు కనబడటం లేదా అని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, ఐకెపి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళల సత్తా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర తుకారాం, మండల అధ్యక్షురాలు ఎనగందుల వనజ, కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి పావని తదితరులు పాల్గొన్నారు.