రైతులకు ఇబ్బందులు తలెతొద్దు
బిల్లుల చెల్లింపు సత్వరమే జరుగాలి
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సమీక్ష
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ఆమె సూచించారు.

శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువుల నిల్వలను సమకూర్చుకోవడం, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, ఆయిల్ పామ్ లక్ష్య సాధన తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి, పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూసుకోవాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు,చెల్లింపుల విషయం లో నిర్లక్ష్యం వహించ వద్దని సూచించారు. ఈ విషయం
జిల్లా కలెక్టర్ టి వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.ప్రతి రోజూ 40 కోట్ల విలువ గల ధాన్యం సరాసరి 18 వేల మెట్రిక్ టన్నుల నుండి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం కు చెల్లింపులు సత్వరం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, రైస్ మిల్లులకు సీ ఎం ఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిర్దిష్ట గడువులోగా మిల్లింగ్ జరిపి పౌర సరఫరాల శాఖకు బియ్యం నిల్వలు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సి.ఎస్. సూచించారు. పది రోజుల వ్యవధిలో కనీసం యాభై శాతం బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖకు రైస్ మిల్లర్లు చేరవేసేలా చూడాలని గడువు విధించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందేలా చొరవ చూపాలని సీ.ఎస్ సూచించారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమం 69 రోజులు పూర్తి చేసుకుందని, ఇదే తరహాలో మిగిలిన 31 రోజుల పాటు శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ త్వరగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకునేలా చూడాలని, ఈ కార్యక్రమం అమలవుతున్న ఆసుపత్రులను క్రమం జిల్లా కలెక్టర్ లు,సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా సందర్శిస్తూ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ
వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.