బడులకు మౌలిక సదుపాయాలు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు వేగవంతం చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో మన ఊరు – మన బడి, మనబస్తి – మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, అర్&బి, విద్య,మౌలిక వసతులు, అర్. డబ్ల్యు.ఎస్. శాఖల ఈ.ఈ.లు,డి.ఈ లు , ఏ.ఈ.లు,ఎం.ఈ. ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యంగా ఇంకా పనులు పెండింగ్ ఉన్న
మోడల్ పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తిచేసి వెంటనే ప్రారంభించాలని అన్నారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలలు చొప్పున మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చిన్న చిన్న పనులు వుంటే త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా మోడల్ పాఠశాలలు కాకుండా మొదటి విడత ఎంపిక చేసిన పాఠశాల ల పనులు కూడా జూన్ లో పాఠశాలల పునః ప్రారంభం కావటానికి ముందే పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలాల వారీగా పెండింగ్ పనుల పై సమీక్షించి పనులు పురోగతి పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల పురోగతి లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. 30 లక్షలపై బడిన టెండర్ పిలవని పనులు తొందరగా టెండర్ ఖరారు చేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తమకు కేటాయించిన మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఎం.ఇ.ఓ.లు, హెడ్మాస్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ లు, సర్పంచులను సమన్వయం చేసుకొని పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పనులు పూర్తయిన పాఠశాలలకు చిన్న చిన్న పెయింటింగ్ వర్కులు తొందరగా వేయించి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన తెలిపారు. పనులు పూర్తి అయిన పాఠశాలల ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యేల సమయం తీసుకొని ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, డీ.ఈ.వో బిక్షపతి, పంచాయతీరాజ్ ఎస్.ఈ.. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.