24 గంటల్లో జంట హత్యల
కేసును చేధించిన పోలీసులు
బీహార్ వాసి నిందితుడి అరెస్ట్
సిపి, డిసిపి ప్రశంసలందుకున్న
సీఐ రామయ్య బృందం
నందిగామ, అక్షిత ప్రతినిధి :
ఓ జంట హత్యల కేసును నందిగామ పోలీసులు ఎంతో చాకచక్యంగా 24 గంటల్లో చేధించారు. వివరాల్లోకి వెళ్తే
సైబరాబాద్ కమీషనరేట్ పరిధి నందిగామ మండల కేంద్రంలో ఈనెల 16న ఎర్రగారి పార్వతమ్మ (60), మాదేపురం భానుప్రియ (9) లను హత్య చేసి పరారైన నిందితుడు బీహార్ వాసిని నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామకు చెందిన ఎర్రగారి పార్వతమ్మ (60) భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమారులు కలరు. ఒక కొడుకు చనిపోగా మరొక కుమారుడు అదృశ్యమయ్యాడు. పార్వతమ్మ బందకుంట తండా నందు అంగన్వాడీ ఆయాగా పని చేస్తుంది. మృతురాలుకు ఎవ్వరూ లేనందున తన చెల్లెలు కుమారుడైన కృష్ణయ్య కూతురు మాదేపురం భానుప్రియ (9) ను తన దగ్గర పడుకోవడానికి పిలుచుకుంటూ తన బాగోగులు చూసుకుంటున్నది. బీహార్ రాష్ట్రo, జాముహి జిల్లా ఝాజకు చెందిన దివాకర్ సాహు తన భార్య అంజలిదేవితో కలిసి ఏప్రిల్, 2023 నెలలో మృతురాలు ఎర్రగారి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు దిగారు. దివాకర్ సాహు, అంజలిదేవి తరచూ గొడవ పడుతుండడంతో ఎర్రగారి పార్వతమ్మ వారిని ఇల్లు ఖాళీ చేయించింది.

ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఎర్రగారి పార్వతమ్మపై పగ పెంచుకున్నాడు. ఎర్రగారి పార్వతమ్మ ఇంట్లో ఉంటున్న క్రమంలో మృతురాలికి ఎవ్వరూ లేరని తన దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించాడు. తరువాత దివాకర్ సాహు ఎర్రగారి పార్వతమ్మ ఇంటికి దగ్గరిలోనే వేరే ఇంట్లో కిరాయికి ఉన్నాడు. ఎర్రగారి పార్వతమ్మ పైన పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఈనెల 16న తను ఉంటున్న ఇంట్లో నుండి అర్ద రాత్రి నిద్ర లేచి తను బయటికి కాలకృత్యాలకు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్ళి ఎర్రగారి పార్వతమ్మ ఇంటికి వెళ్ళి కాంపౌండ్ గోడ దూకి చిన్న గేట్ ఆవరణలో పడుకొన్న ఎర్రగారి పార్వతమ్మను దివాకర్ సాహు గొంతు గట్టిగా పట్టుకొని ఇటుక పెల్లతో తలపై గట్టిగా కొట్టగా ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే పక్కన పడుకొని ఉన్న ఎర్రగారి పార్వతమ్మ మనువరాలు భాను ప్రియ లేచి అరువగా అందుబాటులో ఉన్న ఇటుకతో తలపై కొట్టి తను బ్రతికి ఉంటే గుర్తిస్తుందని భావించి అందుబాటులో ఉన్న కత్తిని తీసుకొని భానుప్రియను దివాకర్ సాహు గొంతు కోసి చంపాడు. తదుపరి దివాకర్ సాహు పార్వతమ్మ దగ్గర ఉన్న చిన్న సంచిలో గల బీరువా తాళo చెవిని తీసుకొని ఇంట్లోకి పోయి అల్మరాలో బంగారు పుస్తెలతాడు, బంగారు వంకు, వెండి కాలి పట్టాలు, 1,000/- నగదును దొంగిలించుకొని పారిపోయి ఇంటికెళ్ళాడు. ఈ విషయమై మాదేపురం శశికళ ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. శంషాబాద్ డిసిపి ఆధ్వర్యంలో నిందితులను పట్టుకునేందుకు
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్న క్రమంలో ఇంతకు మునుపు మృతురాలు ఎర్రగారి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉన్న దివాకర్ సాహు పైన అనుమానo వచ్చి తను ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆ ఇంటి యజమాని, దివాకర్ సాహు అతని భార్యను పొద్దున ఇల్లు ఖాళీ చేయించగా వారు వెళ్ళి పోయినారని సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దివాకర్ సాహుని పట్టుకొని విచారించగా నిందితుడు తాను చేసిన నేరము ఒప్పుకొని దొంగిలించిన వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. ఈ జంట హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నందిగామ ఇనస్పెక్టర్ చిర్ర రామయ్య, నందిగామ పియస్ సిబ్బంది, ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఆయా బృందాన్ని సిపి సైబరాబాద్, డిసిపి శంషాబాద్ అభినందించారు.